దేశవ్యాప్తంగా ఈ ఏడాది కోటి ఇండ్ల నిర్మాణం

across the country Construction of crore houses this year– తెలంగాణకు వాటాకంటే ఎక్కువే ఇండ్ల మంజూరు
– విద్యుత్‌ విషయంలో రాష్ట్రానికి సాయం చేసేందుకూ సిద్ధం
– కరీంనగర్‌ సభలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
– స్మార్ట్‌సిటీ డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ ప్రారంభం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మిస్తాం. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువే ఇండ్లు మంజూరు చేస్తాం. ఈ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నా. పదేండ్లలో కేంద్రం నుంచి రూ.లక్షల కోట్లు తెలంగాణకు కేటాయిస్తే సకాలంలో ఖర్చు చేయడంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ (యూసీ)ని సమర్పించడంలో జాప్యం వల్లే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతున్నాయి’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. పదేండ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణాభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు. పన్నుల రూపేణా రూ.2.3 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ. 6.2 లక్షల కోట్లు కేటాయించామని వివరించారు. గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కూడా రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ ఆర్థిక (2024-25) సంవత్సరంలోనే రూ.21వేల కోట్లు కేటాయించేలా బడ్జెట్‌ అంచనాలను రూపొందిం చినట్టు చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.లక్షా 20వేల కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ.లక్షా10వేల కోట్లు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రైల్వేలేన్‌, స్టేషన్ల అభివృద్ధికి పదేండ్లలో రూ.32 వేలా 946 కోట్లను కేటాయించి రాష్ట్రంలో రైల్వే రూపురేఖలే మారుస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క ఆర్థిక (2024-25) సంవత్సరంలోనే రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5 వేలా 336 కోట్లు కేటాయించామంటూ వివరించారు. ఇలా అనేక సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రానికి అవసరమైన నిధులు సంపూర్ణంగా ఇస్తూ వస్తున్నా.. కేంద్రంపై అభాండాలు వేయడం సరికాదన్నారు.
పీఎం స్వనిధి అమలులో కరీంనగర్‌ రెండో స్థానం
‘కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం విషయంలో కరీంనగర్‌ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 12వేల మంది వీధి వ్యాపారులకు కేంద్ర రుణసాయం అందుతోంది. ఈ స్కీం కింద దేశవ్యాప్తంగా 67 లక్షలా 90 వేల మందికి లబ్ది చేకూరిస్తే.. ఒక్క తెలంగాణలోనే 4.25లక్షల మందికి లబ్ది చేకూరింది’ అని కేంద్ర మంత్రి వివరించారు. పీఎం ముద్ర పేరిట దేశవ్యాప్తంగా రూ.30 లక్షల కోట్ల (కొలెటరాల్‌ ఫ్రీ లోన్స్‌) రుణాలను 50 కోట్ల మంది ఖాతాల్లో జమ చేశామని, తెలంగాణలో 73 లక్షల మంది ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ అయ్యాయని తెలిపారు.
కరీం’నగరం’లో స్మార్ట్‌సిటీ పనుల ప్రారంభం
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉదయం 10గంటలకు చేరుకున్న కేంద్ర మంత్రి ఖట్టర్‌ తొలుత తెలంగాణ చౌక్‌లోని రూ.8.2కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్‌ పార్క్‌, అంబేద్కర్‌ స్టేడియంలోని రూ.22కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, అనుబంధ భవనాలను సహా కుమ్మరివాడీ హైస్కూల్‌లో స్మార్ట్‌ డిజిటల్‌ తరగతి గదులను ప్రారంభించారు. హౌసింగ్‌ బోర్డు పరిధిలోని 2660 ఇండ్లకు 24గంటల మంచినీటి సరఫరాను ప్రారంభించారు.

మూడు పార్టీల నేతలు
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కేంద్రంలోని బీజేపీ మంత్రి సహా అదే పార్టీకి చెందిన స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సంజరు, బీఆర్‌ఎస్‌ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునిల్‌రావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌, పొన్నం ప్రభాకర్‌ కలిసి పర్యటించడం గమనార్హం. అందులోనూ గతంలో కరీంనగర్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని బీజేపీ ఎంపీ సంజరుపై విమర్శలు చేసిన బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్‌ సునిల్‌రావు ఈ బహిరంగ సభలో మాత్రం ఎంపీ సంజరు చొరవతోనే రూ.428కోట్లు మంజూరు అయ్యాయని పొగుడుతూ మాట్లాడారు. అనంతరం స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నగరవ్యాప్తంగా 24గంటల మంచినీటి సరఫరా కోసం రూ.300కోట్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సహా జిల్లా అధికారయం త్రాంగం, కరీంనగర్‌ మున్సిపాల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Spread the love