ఆ వ్యాఖ్యలు ప్రధాని కొత్త ఎత్తుగడలో భాగం: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ : కాంగ్రెస్‌పై ప్రధాని  వ్యాఖ్యలు కొత్త ఎత్తుగడలో భాగమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ కొత్త ఎత్తుగడలు ప్రయోగిస్తున్నారని  సోమవారం విమర్శించారు. లోక్‌సభ మొదటి దశ ఎన్నికల పట్ల ‘నిరాశ’ కు గురైన ప్రధాని ఇప్పుడు అసత్యాలు, విద్వేష ప్రసంగాలను ఆశ్రయించారని అన్నారు.  దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గరిష్టంగా ఉన్నా.. ప్రధాని అంతా సవ్యంగానే ఉంది అన్నట్లు  వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని అనేక కొత్త ఎత్తుగడలను ప్రయోగిస్తున్నారని, కానీ ఆయన అబద్ధాలకు ప్రజలు త్వరలోనే ముగింపు పలుకుతారని అన్నారు. ప్రధాని మోడీ విషపూరిత  భాషను వినియోగిస్తున్నారని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ దుయ్యబట్టారు. 1951 నుండి ప్రతి పదేళ్లకొకసారి జనగణన చేపడతామని, దీంతో ఎస్‌సి, ఎస్‌టి జనాభా వాస్తవ డేటాను అందిస్తుందని అన్నారు. చివరిసారిగా 2021లో జనాభా లెక్కలు చేపట్టారని అన్నారు. ఇప్పటివరకు జనగణన ఎందుకు చేపట్టలేదని, ఈ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర అని అన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన నగదును కాంగ్రెస్‌ పార్టీ చొరబాటు దారులకు, ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి దోచిపెట్టేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోందని రాజస్థాన్‌లోని బన్స్వారాలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ ఆదివారం అవాకులు, చవాకులు పేలారు.

Spread the love