ఆ ఇద్దరు మెరిసేనా?

ఆ ఇద్దరు మెరిసేనా?– నేడు ఆసీస్‌తో భారత్‌ పోరు
– కఠిన సవాల్‌కు సిద్ధమైన రోహిత్‌సేన
– కంగారూలకు ఇక చావోరేవో
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌
సూపర్‌8 దశ అంతిమ ఘట్టానికి చేరుకుంది. వరుస మ్యాచుల్లో విజయాలు సాధించిన భారత్‌.. నేడు చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అఫ్గాన్‌ చేతిలో ఓటమితో ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నేడు భారత్‌తో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆ జట్టు నిలుస్తుంది. ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్న టీమ్‌ ఇండియాకు ఫలితంపై పెద్దగా ఆందోళన లేదు కాదు. కానీ స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఫామ్‌ తలనొప్పిగా మారుతోంది. గ్రాస్‌ఐలెట్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా సూపర్‌8 సమరం నేడు.
నవతెలంగాణ-గ్రాస్‌ఐలెట్‌

కోహ్లి, రోహిత్‌ రాణించేనా?
వరుస విజయాల ఊపుమీదున్న భారత్‌కు కీలక ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఫామ్‌ ఆందోళనగా మారింది. గ్రూప్‌ దశలో కోహ్లి పూర్తిగా నిరాశపరిచినా.. రోహిత్‌ ఓ అర్థ సెంచరీతో మెరిశాడు. సూపర్‌8లో దంచికొడ్తారని అనుకుంటే ఇక్కడ ఇద్దరూ విఫలమవుతున్నారు. భారత్‌ ధనాధన్‌ వ్యూహంతో ఆడుతోంది. దీంతో ఓవర్లో తొలి నాలుగు బంతులు బౌండరీ దాటినా.. చివరి రెండు బంతులను సైతం భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌, కోహ్లి వికెట్‌ పారేసుకుంటున్నారు. సహజశైలిలో ఆడుతూనే దండిగా పరుగులు రాబట్టే ప్రణాళిక ఈ ఇద్దరు తక్షణమే ఆలోచన చేయాలి. లేదంటే, కీలక సెమీఫైనల్‌ ముంగిట కోహ్లి, రోహిత్‌ భారత్‌కు బలహీనతగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇక మిడిల్‌ ఆర్డర్‌ గొప్పగా కనిపిస్తోంది. రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబె, హార్దిక్‌ పాండ్య ఫామ్‌లో ఉన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లు బ్యాట్‌తో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌ చేరిక వైవిధ్యత తీసుకొచ్చింది. కుల్దీప్‌ మాయ, బుమ్రా పేస్‌ ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. నేడు ఆసీస్‌పై అర్షదీప్‌, కుల్దీప్‌, బుమ్రా ఏం చేస్తారో చూడాలి.
కంగారూలకు చావోరేవో
అఫ్గాన్‌ చేతిలో ఓటమి ఆసీస్‌ను ఇరకాటంలో పడేసింది. నేడు భారత్‌ చేతిలో ఆసీస్‌ ఓడి.. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాపై అఫ్గాన్‌ నెగ్గితే ఎటువంటి సమీకరణాలతో పని లేకుండా నేరుగా అఫ్గనిస్థాన్‌ సెమీఫైనల్‌కు చేరుకోనుంది. భారత్‌పై గెలుపొందినా.. బంగ్లాపై అఫ్గాన్‌ విజయం సాధిస్తే నెట్‌ రన్‌రేట్‌ తెరపైకి రానుంది. దీంతో ఎటు చూసినా ఆస్ట్రేలియాకు నేడు సూపర్‌8 పోరు అత్యంత కీలకం. ఓటమి నైరాశ్యంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. డెవిడ్‌ వార్నర్‌, ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, టిమ్‌ డెవిడ్‌లు ఆసీస్‌కు కీలకం కానున్నారు. స్పిన్నర్లు జంపా, ఆగర్‌ భారత బ్యాటర్లకు సవాల్‌ విసిరేందుకు ఎదురు చూస్తున్నారు.
పిచ్‌, వాతావరణం
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన వేదిక గ్రాస్‌ ఐలెట్‌లోని డారెన్‌ సామీ క్రికెట్‌ స్టేడియం. భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌కు సైతం పరుగుల పిచ్‌ను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు 218 పరుగులు. ప్రపంచకప్‌లో ఇక్కడ ఐదు మ్యాచులు జరుగగా మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు, రెండింట తొలుత బౌలింగ్‌ చేసిన జట్టు గెలుపొందింది. నేడు మ్యాచ్‌ ముంగిట భారీ వర్షం సూచనలు ఉన్నాయి. అర్థరాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు వర్షం కురువనుంది. కానీ మ్యాచ్‌ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. అవుట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచితే మ్యాచ్‌కు పెద్దగా ఆటంకం కలిగే అవకాశం ఉండదు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబె, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా : ట్రావిశ్‌ హెడ్‌, డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, టిమ్‌ డెవిడ్‌, మాథ్యూ వేడ్‌, పాట్‌ కమిన్స్‌, ఆష్టన్‌ ఆగర్‌, ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.

Spread the love