నవతెలంగాణ – ఢీల్లి: నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కరోల్ బాగ్‌లో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని ఢిల్లీలోని రాయ్‌గర్ పురా నివాసి హేమంత్‌గా గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి హేమంత్ మద్యం మత్తులో ప్రధాని మోడీని చంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాలర్ హేమంత్ కుమార్ వయస్సు 48 సంవత్సరాలు.. అతని వివరాలను సేకరించి రాయగర్ పురా, కరోల్ బాగ్, పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేశామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని వారు తెలిపారు. ఉద్యోగం లేకపోవడం వల్లే మద్యానికి బానిసగా మారిన హేమంత్ కోపంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానంటూ కాల్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు.