జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు అరికట్టాలి

జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు అరికట్టాలి– ఎస్పీకి జర్నలిస్టు జేఏసీ వినతి
– కాంగ్రెస్‌ నాయకుడు కందిపై ఫిర్యాదు

నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
రాజకీయ పార్టీలకు, నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలను అరికట్టాలని జర్నలిస్టు జేఏసీ కన్వీనర్‌ నూక దేవేందర్‌ కోరారు. ఈ విషయమై బుధవారం ఎస్పీ గౌస్‌ ఆలంను డీపీఓ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలోని పలువురు జర్నలిస్టులకు కేసులు నమోదు చేస్తామని బెదిరించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. తాజాగా టీవీ 9 స్టాఫ్‌ రిపోర్టర్‌ నరేష్‌పై కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడడంతో పాటు తమ పార్టీ అనుచరులను సదరు జర్నలిస్టు ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపినట్లు సమాచారం రావడంతో ఎస్పీని కలిసి ఇలాంటి ఘటనల గురించి వివరించారు. జర్నలిస్టులు రాసిన వార్తలలో అవాస్తవముంటే న్యాయపరంగా లీగల్‌ నోటీసులు పంపాలి, పరువు నష్టం దావా వేయాలి, ఇలా కాకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించాలి, కానీ ఇలా వార్తలు రాసే జర్నలిస్టులను బెదిరించడం, భౌతిక దాడులకు ప్రయత్నించడం ఏ మేరకు సమంజసమని ఎస్పీకి వివరించారు. ఏ జర్నలిస్టు కుల మత, రాజకీయాలకు సంబంధం లేకుండా వార్తలు రాస్తారని, అలాంటి వారికి కులం అంటగడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ బద్నాం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించి ఘటనపై సరైన విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్‌ జేఏసీ కో కన్వీనర్‌ వెంకటేష్‌, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా స్టాఫ్‌ రిపోర్టర్లు, రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్స్‌, కెమెరామెన్‌లు పాల్గొన్నారు.
భైంసా : ఆదిలాబాద్‌ టీవీ9 స్టాఫర్‌ నరేష్‌ను బెదిరించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆయన అనుచరులపై చర్య తీసుకోవాలని టిడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్‌, టియుడబ్ల్యూ జే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయ వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love