జీపీ కార్మికులకు బెదిరింపులు సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర

– దినసరి కూలీలతో పారిశుధ్య పనులు చేయించేందుకు యత్నం
– అడ్డుకున్న కార్మికులు.. కొనసాగుతున్న సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ దినసరి కూలీలతో పనులు చేయించేందుకు యత్నించారు. కార్మికులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. తమ గోడును వినాలంటూ అంబేద్కర్‌ విగ్రహాలకు వినతులు అందించారు.
నవతెలంగాణ- విలేకరులు
ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రంలో కొనసాగుతున్న జీపీ కార్మికుల సమ్మెకు అడ్డంకులు ఏర్పడ్డాయి. మంగళవారం బెజ్జూర్‌ గ్రామ ఉప సర్పంచ్‌, కార్యదర్శి కలిసి దినిసరి కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులను రప్పించి పనులు చేయించారు.
ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల కేంద్రంలో జీపీ కార్మికులు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహిం చారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజే శారు. తల్లాడలో కాంగ్రెస్‌ నాయకులు మట్టా దయా నంద్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం కార్మికు లతో కలిసి అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ పర్యటన నేపథ్యంలో నరసాపురం, రెడ్డిపాలెం, లక్ష్మీపురం గ్రామాల నుంచి కార్మికులను రప్పించి పోలీస్‌ బలగాల పహారా మధ్య పారిశుధ్య పనులు చేయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఎంబి నర్సారెడ్డి, మర్లపాటి రేణుక, నాగరాజు, లక్ష్మణ్‌, ఏఐటీయూసీ నాయకులు సునీల్‌ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పంచాయతీ కార్మికుల మధ్య కొంతసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా కార్మికులు పోలీసులను చుట్టుముట్టడంతో వెనక్కి తగ్గారు. తమపై గ్రామపంచాయతీ ఈవో కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో జీపీకార్మికుల సమ్మె శిబిరాన్ని జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జిల్లా జేఏసీ చైర్మెన్‌ దాసరి పాండు సందర్శించి మాట్లాడారు. జెడ్పీ కార్యాలయం ఎదుట కార్మికులు రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు, మర్రిగూడ మండలాల్లో సమ్మె శిబిరాలను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మినారాయణ సందర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడరూరల్‌ మండలంలో జీపీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర నాయకులు సోమపంగు రాధాకృష్ణ మద్దతు తెలిపారు. బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హుజూర్‌నగరకు వచ్చిన అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పెన్‌పహాడ్‌లో జీపీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ ఎంపీటీసీ గద్ధల నాగరాజు సంఘీభావం తెలపడంతోపాటు రూ.1000 అందజేశారు.

Spread the love