నవతెలంగాణ-మెదక్: వర్గల్ మండలం అంబర్‌పేట్ గ్రామానికి చెందిన దొడ్డు బాలమణి(30), ఆమె కుమారుడు చరణ్(10).. రంగాయపల్లిలో బోనాల పండుగకు హాజరయ్యారు. అయితే సోమవారం మధ్యాహ్నం తమ బంధువులైన దొడ్డు లక్ష్మి(25), పిరంగి లావణ్య(25), బాలమణి, చరణ్ కలిసి చెరువులో స్నానాలకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బాలుడు నీట మునిగిపోవడంతో అప్రమత్తమైన తల్లి బాలమణి, అతన్ని కాపాడేందుకు యత్నించగా, ఆమె కూడా నీట మునిగింది. దీంతో మిగతా ఇద్దరు మహిళలు కూడా వారిద్దరిని కాపాడేందుకు యత్నించగా, నీట మునిగారు. దీంతో ముగ్గురు మహిళలు, బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను చెరువులో నుంచి బయటకు వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.