నవతెలంగాణ-బాలానగర్
అక్రమంగా హాష్ ఆయిల్‌ను రవాణా చేస్తున్న ముగ్గురిని సైబరాబాద్ ఎస్‌ఓటి బృందం బాలానగర్ పోలీసులతో కలిసి అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సభావత్ సుమన్‌ను 2021లో డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొలుగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతను విశాఖపట్నం జైల్లో ఉన్న సమయంలో ఒడిశాకు చెందిన కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. వారు జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బు సంపాదించడానికి గంజాయి, హాష్ ఆయిల్‌ను రవాణా చేయాలనుకున్నారు. వారికి తెలిసిన వ్యక్తి.. గతంలో ఎన్డీపీఎస్ కేసులో మూడు సార్లు జైలుకు వెళ్లిన కేతావత్ విజరు కుమార్‌ను కలిసి గంజాయి కొనుగోలుకు కస్టమర్లను వెతకాలని కోరారు. ఒడిశా రాష్ట్రం నుంచి హాష్ ఆయిల్‌ను ఏర్పాటు చేయాలని కిరణ్‌కు సుమన్ చెప్పాడు. అక్టోబర్ 27న సభావత్ సుమన్ మరోవ్యక్తి రమావత్ లాలుతో కలిసి పల్సర్ బైక్‌పై నల్లగొండ జిల్లా దేవరకొండ, పోలేపల్లి గ్రామం నుంచి పాడేరు వరకు 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. అక్కడ కిరణ్ వారికి 2,590 లీటర్ల హాష్ ఆయిల్ ిచ్చాడు. అనంతరం విజరు కుమార్ మార్గదర్శకత్వంతో అక్టోబర్ 31న సభావత్ సుమన్, రమావత్ లాలు సనత్‌నగర్‌కు వచ్చారు. అక్కడ కస్టమర్ల కోసం వెతుకుతూ శోభన బస్‌స్టాప్ వద్దకు చేరుకోగానే ఎస్‌ఓటీ శ్రీనివాస్, సైబరాబాద్ డీసీపీ సురేష్ కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బాలానగర్ ఎస్‌ఓటి, సైబరాబాద్, బాలానగర్ పోలీసుల బృందం నిందితులను అరెస్టు చేసింది. కేతావత్ విజరు కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ పరారీలో ఉన్నాడు. పట్టుబడిన వారి నుంచి రూ.12,95,000 విలువ చేసే 2.590 లీటర్ల హాష్ ఆయిల్, పల్సర్ మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ రూ.13,50,000 ఉంటుంది.
నిందితులను పట్టుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటి డీసీపీ శ్రీనివాస్, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీలు సత్యనారాయణ, శోభన్ కుమార్, బాలానగర్ ఏసీపీ హనుమంత్ రావు, బాలానగర్ బృందాన్ని పై అధికారులు అభినందించారు. గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరాదారులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే.. డయల్ 100 లేదా సైబరాబాద్ ఎన్‌డీపీఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ 7901105423 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 944906174కు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ చెప్పారు.