లగచర్ల రైతులపై మూడు కేసులా?

Three cases against Lagacharla farmers?– ఆ కేసుల వివరాలు, వాంగ్మూలాలివ్వండి
– పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఫార్మసిటీ భూసేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారులపై రైతులు దాడి చేశారనే కేసులో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడంపై హైకోర్టు ఆరా తీసింది. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడికి ప్రయత్నించారని రైతులపై ఎన్ని కేసులు పెడతారని పోలీసులను ప్రశ్నించింది. ఆ కేసులు, వాటిలో సేకరించిన వాంగ్మూలాల వివరాలను అందజేయాలని పోలీసులకు ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ 153, 154, 155 నమోదు చేయడాన్ని రైతులు సవాల్‌ చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ లక్ష్మణ్‌ గురువారం విచారించారు. ఇప్పటికే బొమ్రాస్‌పేట పోలీసులు నమోదు చేసిన 154, 155 కేసుల్లో రైతులను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు పవార్‌నాయక్‌ మరికొందరు, మందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ మరో 17 మంది వేర్వేరుగా వేసిన కేసుల్లో కూడా అరెస్టు చేయరాదని ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 28కి విచారణను వాయిదా వేశారు.
బీఆర్‌ఎస్‌ భూమిపై కౌంటర్‌ వేయండి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలభూమిని రూ.37 కోట్లకే కేటాయించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను గురువారం హైకోర్టు విచారించింది. ప్రభుత్వం కౌంటర్‌ వేయాలని ఆదేశించింది విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. కోకాపేటలో సర్వే నెం.239, 240లో బీఆర్‌ఎస్‌కి 11 ఎకరాల భూమిని కేటాయింపు వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందంటూ రెండు పిల్‌లు దాఖలయ్యాయి. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఎ.వెంకటరామిరెడ్డి వేసిన పిల్‌లను చీఫ్‌ జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ జి.రాధారాణిలతో కూడిన బెంచ్‌ గురువారం విచారించింది. ఎకరం ధర రూ.50 కోట్లకుపైగా ఉందనీ, ప్రభుత్వం 3.4 కోట్లకే ఇచ్చిందని వారు ఆ పిల్‌లో పేర్కొన్నారు. కౌంటరు దాఖలు చేయడానికి 4 వారాల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ఆఫీసుల నిమిత్తం 2004లో వెలువడిన జీవో 966ను కొట్టేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములునాయక్‌ వేసిన పిల్‌ను కూడా హైకోర్టు విచారించింది. టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన భూమిలో టీన్యూస్‌ ఛానల్‌ నడుస్తోందన్నారు. ఈ పిల్‌లో కూడా ప్రభుత్వం కౌంటర్‌ వేయాలని ఆదేశించింది.
వీసీగా చక్రపాణి నియామకంపై పిటిషన్‌
డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా డాక్టర్‌ చక్రపాణి నియామకాన్ని సవాల్‌ చేసిన కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌లతోపాటు వీసీ చక్రపాణిలను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీసీ నియామక జీవో 229ను అసోసియేట్‌ రిటైర్డ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.కుమారస్వామి సవాల్‌ చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారించారు. విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు
ఓఆర్‌ఎస్‌ అమ్మకాలపై పిల్‌
ఓఆర్‌ఎస్‌ అమ్మకాలపై దాఖలైన పిల్‌ను గురువారం హైకోర్టు విచారించింది. ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌, స్టేఫిట్‌ హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లను ఆదేశించింది. విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. కేంద్ర ఆహార భద్రతా మండలి గైడ్‌లైన్స్‌ అమలు కావడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎం.శివరంజని వేసిన పిల్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ జి.రాధారాణిలతో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది.
రోడ్ల గుంతలపై యాప్‌ రూపొందించండి
రోడ్లపై గుంతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రజలు తెచ్చేందుకు వీలుగా ఒక యాప్‌ను 4 వారాల్లోగా రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌అండ్‌బీలో ఉన్నట్టుగా ‘టీ-రస్తా’ అనే యాప్‌ ఉన్నట్టుగానే ఇతర రోడ్ల విషయంలోనూ యాప్‌ ఉండాలంది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను ఆదేశించింది.లాయర్‌ అఖిల్‌ శ్రీగురుతేజ వేసిన పిల్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజరుపాల్‌, జస్టిస్‌ జి.రాధారాణిలతో కూడిన బెంచ్‌ గురువారం విచారించింది.

Spread the love