మూడు కమిటీలు

Deputy CM Bhatti– రాష్ట్ర విభజన సమస్యలపై సీఎంల నిర్ణయం
– అధికారులతో త్రీమెన్‌ కమిటీ
– తెగని పక్షంలో మంత్రులు కమిటీ
– ఆ తర్వాతనే ముఖ్యమంత్రుల ఆమోదం
– మూడు దశల్లో పరిష్కార మార్గాలు
– సైబర్‌ క్రైమ్‌పై సమన్వయంతో పని చేయాలి
– ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం : డిప్యూటీ సీఎం భట్టి, ఏపీ మంత్రి సత్యప్రసాద్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో చర్చించి, పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు నిర్ణయించారు. మూడు కమిటీలను ఏర్పాటు చేసినా దశలవారీగా పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై పలు విభజన అంశాలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు సత్యప్రసాద్‌, జనార్థన్‌రెడ్డి, దుర్గేష్‌ తదితరులు ఉమ్మడిగా విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు సంబంధించిన ఎన్నో సమస్యలను పదేండ్లుగా గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టాయనీ, వాటిపై ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోని సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని తాము భావించలేదని వివరించారు. ఆ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించామన్నారు. రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అందుకు మూడు స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల(సీఎస్‌) స్థాయి ఉన్నతాధికారులతో ‘త్రీమెన్‌ కమిటీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రెండు వారాల్లో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ సమావేశమై వారి స్థాయిలో ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని చెప్పారు. ఉన్నతస్థాయి అధికారుల కమిటీ కూడా పరిష్కారం చూపలేని మిగిలిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ దృష్టి సారిస్తున్నదని చెప్పారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రులు ఆమోద ముద్రవేస్తారని అన్నారు. తెగని అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి సరైన పరిష్కార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు వివరించారు. వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పని చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించామన్నారు. యాంటీ నార్కోటిక్‌ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అడిషనల్‌ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నదని తెలిపారు. సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి సామాన్య ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని చెప్పారు. ఈ రెండు అంశాల్లో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలనీ, వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
దీంతో రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్‌ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటు చేయాలనీ, సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విభజన సమస్యలపై త్వరితగతిన చర్చించుకునేందుకు సీఎం స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి సత్యప్రసాద్‌ చెప్పారు. ఇప్పటికిప్పుడే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తాము భావించలేదన్నారు. రెండు వారాల్లో మరోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాలను మంత్రుల కమిటీ ఏర్పాటు తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అక్కడ కూడా వీలుకాకపోతే సీఎంల స్థాయిలో చర్చించుకోవాలని భావించామన్నారు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో, సైబర్‌ క్రైమ్‌ నియంత్రణకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కో ఆర్డినేషన్‌తో పని చేయాలన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన సమస్యలు పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు లేఖ పంపారని గుర్తు చేశారు. అందరి సలహాలు తీసుకుని చర్చించామన్నారు. డ్రగ్స్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏపీలో ఏర్పాటుచేశామన్నారు.

Spread the love