రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

– భారత్‌ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తింపు
– ఇబ్రహీంపట్నం రాయపోలు వద్ద ఘటన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయపోలు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇబ్రహీంపట్నం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరుకు చెందిన ఎస్‌.నారాయణరెడ్డి (19), లంగర్‌ హౌస్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన ఈ.భాను ప్రసాద్‌ (19), హస్తినాపూర్‌కు చెందిన కె.నవీన్‌(19) ముగ్గురు విద్యార్థులు ఇబ్రహీంపట్నం సమీపంలోని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు ముగ్గురూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోలు నుంచి ఇబ్రహీంపట్నం వైపు బైకుపై వస్తున్నారు. కాగా ఇబ్రహీంపట్నం నుంచి రాయపోలు వైపు వెళ్తున్న ఓ కారు.. జనహర్ష దాటిన తర్వాత హెచ్‌బీ పెట్రోల్‌ పంప్‌ వద్దకు రాగానే కారు, బైక్‌ ఒక్కసారిగా ఢకొీన్నాయి. కారు, బైక్‌ ఇరువురూ అతివేగంతో ఉండటంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. కారులో రెండు హెయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇబ్రహీంపట్నం సీఐ రామకృష్ణ తెలిపారు.

Spread the love