– ఎన్నికల ప్రచారంపై సీఎం కేసీఆర్ యోచన
– ఇప్పటి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్
– కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతల రాకతో సరికొత్త వ్యూహం
ఇప్పటిదాకా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు.. ఎస్పీ ఆఫీసులు, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల ఓపెనింగుల పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి వచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పటి నుంచి ‘రూటు’ మార్చనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీడు పెరగటం, బీజేపీ జాతీయ నాయకులను తీసుకొచ్చి హడావుడి చేస్తుండటం తదితర కారణాల రీత్యా ఆయన కూడా సరికొత్త ఎన్నికల వ్యూహాన్ని రచించారు. ఇప్పటి నుంచే దాన్ని అమలు చేయబోతున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తనతోపాటు సమాన ప్రాధాన్యత కల్పించటం ద్వారా ఎన్నికల ప్రచారంలో ఆయన వారిని వినియోగించుకోనున్నా రు. ఇందుకోసం ఉత్తర, దక్షిణ తెలంగాణాలతోపాటు హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేకంగా విభజించుకుని… ఆయా ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్లాన్‌ను కేసీఆర్ రూపొందించినట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఆ షెడ్యూల్ ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉంటే… మిగతా రెండు ప్రాంతాల్లో కేటీఆర్, హరీశ్ విడివిడిగా పర్యటిస్తారు. మరో సందర్భంలో సీఎం దక్షిణ తెలంగాణ పర్యటనకు వెళితే… మంత్రులిద్దరూ మిగతా ఏరియాల్లో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు. తద్వారా ఒకే రోజు ముగ్గురు నేతలూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ద్వారా అటు కాంగ్రెస్, బీజేపీ మీద ఎదురుదాడి చేయొచ్చన్నది కేసీఆర్ వ్యూహం.
జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఇప్పటికే పలు సభలతో హడావుడి చేస్తోంది. కర్నాటక ఫలితాలతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిండిన జోష్‌ను అలాగే కొనసాగించేందుకు అది మీటింగుల మీద మీటింగులు నిర్వహిస్తోంది. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన రాహుల్ గాంధీ సభతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. హస్తం పార్టీ నిర్వహించిన ఈ సభ ద్వారా అది ఎలక్షన్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టినట్టే. అందువల్లే రాహుల్… ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే రాహుల్‌తోపాటు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారితోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా ఢిల్లీ పెద్దల్ని రంగంలోకి దించనుంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రాష్ట్రంలో పర్యటించి వెళ్లారు.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ప్రధాని మోడీతోపాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు వరసగా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ పరిణామాలన్నింటి రీత్యా… కాంగ్రెస్, బీజేపీలతో ఢ అంటే ఢ అనే విధంగా గులాబీ దళపతి తన వ్యూహాన్ని, కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టు బీఆర్‌ఎస్‌లోని సీనియర్లు చెబుతున్నారు. అందుకే ఆ రెండు పార్టీలపై మూకుమ్మడిగా విమనాస్త్రాలు సంధించటం ద్వారా వాటిని గుక్క తిప్పుకోకుండా చేయాలంటూ ఆయన కేటీఆర్, హరీశ్‌లకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారం సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించాలని ఆయన వారికి సూచించారు. దాంతోపాటు పెన్షన్లు, రైతులకు సహాయాలు, ఉద్యోగుల జీత భత్యాలు, మహిళా సంక్షేమం తదితరాంశాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చి చూపటం ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రత్యేతకను చాటి చెప్పాలంటూ సీఎం ఆదేశించారు. అప్పుడే ఆ రెండు జాతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కోగలమనీ, ప్రచారాన్ని వేడెక్కించగలమని ఆయన భావిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.