స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత

At the strongrooms Three-tier security– జూన్‌ 4 వరకు పరిసరాల్లో 144 సెక్షన్‌
– ప్రభాకర్‌రావు కోసం రెడ్‌ కార్నర్‌ నోటీస్‌పై త్వరలోనే చర్యలు : ‘నవతెలంగాణ’తో రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన పోలింగ్‌కు సంబంధిం చిన ఈవీఎంల భద్రత కోసం ఏర్పాటైన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా తెలిపారు. మంగళవారం ఆయన ‘నవతెలంగాణ’తో మూడంచెల భద్రతా వ్యవస్థతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘాను పెట్టామని తెలిపారు. ముఖ్యంగా, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలు ఈవీఎంలను పరిరక్షిస్తాయనీ, వాటి తర్వాత రాష్ట్ర టీఎస్‌ఎస్‌పీ బలగాలు పహారా కాస్తాయనీ, వాటి తర్వాతి వరుసలో సివిల్‌ పోలీసులు కాపు కాస్తారని.. ఈ విధంగా మూడంచెలుగా భద్రతను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. వీటితో పాటు స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఒక కిలో మీటరు దూరం వరకు సాయుధ పోలీసులతో గస్తీ ఉంటుందని అన్నారు. ఈ వ్యవస్థ జూన్‌ 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యి ఫలితాలు ప్రకటించే వరకూ కొనసాగుతుందని ఆయన తెలిపారు. మొత్తమ్మీద రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందనీ, అందుకు పోలీసులు ఎంతగానో శ్రమించారని ఆయన ప్రశంసించారు. ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాల్లో కొన్నింటిని మాత్రం రాష్ట్రంలో ఉంచుకొని మిగతావాటిని పంపించేశామని డీజీపీ తెలిపారు.
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు సమగ్రంగా సాగుతున్నదని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసును జారీ చేసినట్టు తెలిపారు. ఇంటర్‌పోల్‌కు నోడల్‌ ఏజెన్సీ అయిన రాష్ట్ర సీఐడీ ద్వారా సీబీఐకి ఈ నోటీసును పంపించామని ,దాని ఆధారంగా సీబీఐ ఇంటర్‌పోల్‌తో సంప్రదించి నోటీసు ప్రక్రియ సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తుందని డీజీపీ వివరించారు. ప్రభాకర్‌రావు ఆచూకీ కోసం మొదలు పెట్టిన రెడ్‌కార్నర్‌ నోటీసు ప్రక్రియ పూర్తి కావటానికి కొంత సమయం పడుతుందనీ, దానిపై రాష్ట్ర సీఐడీ అధికారులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తారని రవిగుప్తా చెప్పారు.

Spread the love