ముప్పేటా వరద ముప్పు

Three year flood threat– ఎటు చూసినా (క)న్నీరే..
– రెండ్రోజులుగా జలదిగ్బంధనంలోనే ప్రజలు
– సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం
ఎడతెరిపి లేని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.. వరదలు ముప్పేటా ముప్పు తెచ్చాయి. ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వరదల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడటం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మూడ్రోజులుగా భారీ నుంచి మోస్తరు వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతోపాటు.. ఎగువ రాష్ట్రాల నుంచి వరదలు పోటెత్తడంతో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు నిండి గ్రామాలను నీరు చుట్టుముట్టింది.
ఇండ్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతోపాటు సూర్యాపేట జిల్లాల్లో వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ప్రజలంతా రెండ్రోజులుగా వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీపీఐ(ఎం), ఇతర రాజకీయ పార్టీల నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నారు. కొట్టుకుపోయిన రోడ్లు, రైల్వే ట్రాక్‌లకు తాత్కాలిక మరమ్మతులపై అధికారులు పరిశీలించారు. తక్షణం చర్యలకు ఉపక్రమించారు.
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
రెండ్రోజులుగా దంచికొడుతున్న వానలతో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది. కాసేపు గెరువిస్తూ.. కాసేపు కుండపోతగా వాన కురిసింది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3268 చెరువుల్లో దాదాపు 2వేల చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. కల్వర్టులు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. పంట చేలు జలసంద్రమయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మామిడిపల్లి- నిజామాబాద్‌, వెంకట్రావుపేట- బావుసాయిపేట, వట్టిమల్ల-నిమ్మపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట-నర్సక్కపేట గ్రామాల మధ్య బిక్కవాగు ఉధిృతితో రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ పట్టణ శివారులోని కోనాయిపల్లి బుడగజంగాల కాలనీలోని లోతట్టు ప్రాంతాన్ని వరద ముంచెత్తడంతో గుడిసెల్లోకి వరద చేరింది. బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించి నిత్యావసర సరుకులు అందించారు.
గల్లంతైన ఇద్దరు మృతి
కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట కారోబార్‌ పవన్‌ కొత్తపల్లి-మల్యాల సమీపంలోని నక్కలవాగు కల్వర్టు వద్ద బైక్‌పై ప్రయాణిస్తుండగా.. ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఇదే మండలం కునారం చెరువులో చేపల వేటకు వలలు కట్టేందుకువెళ్లిన గోస్కులు కుమార్‌(45) సైతం వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయాడు.
పంట పొలాల్లో ఇసుక మేటలు
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఈదురుగాలులకు ఇండ్ల రేకులు లేచిపోయాయి. ముకుందాపురం ఎస్సీ కాలనీలో45 ఇండ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. వరద నీటికి అడ్డుగా వున్న చర్చి గోడను పగలకొట్టడంతో సమస్య తగ్గింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెర్వులు, వాగుల కింద సాగు చేసిన వరి పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామం వద్ద గండి పడిన సాగర్‌ ఎడమ కాలువను ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి, జిల్లా అధికారులతో కలిసి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. బొల్లం మల్లయ్య యాదవ్‌ కూడా పరిశీలించారు. చివ్వెంల మండలంలో చాలా గ్రామాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వాగుల ఉగ్రరూపం..
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పంట పొలాలు జలమయమయ్యాయి. పల్లి, పత్తి, వరి చేలు నీట మునిగాయి. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో నసీం బేగం, సాధికా బేగం, జహీర్‌ ఇండ్లు కూలాయి. వాటిని సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం పరిశీలించింది. గండీడు, మహ్మదాబాదు మండలాల్లో రహదారులు తెగిపోయాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ నియోజకవర్గ ఆస్పత్రి 24 గంటలుగా వరద నీట్లోనే ఉంది. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని కోడూరు గ్రామ శివారులో కస్తూర్బా విద్యాలయం చుట్టూ నీరు చేరింది. భారీ వర్షాలతో రైల్వే బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండటంతో శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడుతామని మహబూబ్‌నగర్‌ ఎంపీ డికె. అరుణ అన్నారు.
వర్షాలు పైన.. వరదలు ఇక్కడ..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. శని, ఆదివారాల్లో ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో జనజీవనం అతలాకుతలం కాగా, సోమవారం వర్ష భయం కొంత వీడినా వరద ముప్పు మాత్రం తగ్గలేదు. ఎగువన మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు.. అక్కడి ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రభావం జిల్లా మీద పడుతోంది.
పెన్‌గంగ ఉగ్రరూపం
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్‌గంగ బ్రిడ్జికి ఆనుకొని ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రాణహిత నది సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యాక్‌ వాటర్‌ కారణంగా పలు పంట పొలాలు నీటిలోనే ఉండిపోయాయి. బేల మండలం సాంగిడి, బెదోడా గ్రామాలను మూడు వైపులా వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి వల్ల నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం సావేల్‌-తడపాకల్‌ గ్రామాల మధ్యన గోదావరి నదిలో ఉన్న సాంబయ్య ఆశ్రమంలోని ముగ్గురు సాదువులు సంతోష్‌, నారాయణ, ముత్తెన్న అక్కడే చిక్కుకుపోయారు. వీరిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సురక్షింతంగా బయటకు తీసుకొచ్చింది.
వర్షపు నీటిలో పోలామా కమ్యూనిటీ
రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లిలో అత్యధికంగా కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గాంధీ పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. శంకర్‌పల్లి మండలంలోని మోకిలా పోలామా కమ్యూనిటీలో 212 విల్లాలు ఉన్నాయి. అందులో 1000 మంది వరకు ఉంటున్నారు. వర్షాలకు పోలామా కమ్యూనిటీ ఏరియా మొత్తం మోకాళ్ల లోతు నీటితో నిండిపోయింది. ఘటనా స్థలాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిశీలించారు. ఈ ప్రాంతంలో గతంలో చెరువు ఉండేదని తెలుస్తోంది. అధికారులు విల్లాల నిర్మాణాలకు పర్మిషన్స్‌ ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు. హిమాయత్‌సాగర్‌ను కలెక్టర్‌ శశాంక్‌ పరిశీలించారు.
రైల్వే ట్రాక్‌లను పరిశీలించిన డిఆర్‌ఎం
మహబూబాబాద్‌ జిల్లా కే సముద్రం మండలలోని తాళ్ల పూసలపల్లి, ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న రైలు పట్టాలను డీఆర్‌ఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ పరిశీలించారు. ఈ రెండు స్టేషనులను ఎక్కువ సిబ్బంది, మిషనరీ ఉపయోగించి త్వరలో మరమ్మతులు పూర్తి చేసి రైలు రాకపోకలకు అనుకూలంగా చేస్తామని తెలిపారు.
నిండు కుండలా జంట జలాశయాలు
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ నగరాన్ని అతలాకుతలం చేశాయి. నగరంలో 9 సెంటీమీటర్ల మేర వర్షం కురియడంతో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వీధులు, కాలనీలు చెరువులను, జలాశయాలను తలపించాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు పెద్దఎత్తున కూలిపోయాయి. జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌తో పాటు హుస్సేన్‌ సాగర్‌లోకి పెద్దఎత్తున్న వరద నీరు చేరుతోంది. బంజారా, పికెట్‌, కూకట్‌పల్లి, బుల్కాపూర్‌ నాలాల నుంచి పెద్దఎత్తున వరద నీరు వస్తుండటంతో హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. హుస్సేన్‌ సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ దాటడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసీ నదికి నీటిని వదిలారు.
మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామ పటేల్‌ చెరువు, పించెరువు నిండుకుండలా మారి అలుగులు పారాయి. మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఇండ్లు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల కేంద్రంలోని పాత చెరువు అలుగుకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. బెజ్జంకిలో వాగులో జాలరి గల్లంతయ్యారు.
తెగిన సీతారామ ప్రాజెక్టు కాలువ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రిగుండ పంచాయతీ పరిధిలో కోయ గట్టు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కాలువ తెగింది. కరకగూడెం మండలంలో కరకగూడెం, చిరమళ్ళ గ్రామాల ప్రధాన రహదారి, పెద్దవాగు బ్రిడ్జి కోతకు గురైంది. ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర రెడ్డి బ్రిడ్జిని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ఖమ్మం నగరంలోని బైపాస్‌ రోడ్డు బ్రిడ్జి మరమ్మతు పనులను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పరిశీలించారు.

Spread the love