నవతెలంగాణ – బీహార్: బీహార్ రాష్ట్రం పాట్నాలో ఓ పాఠశాలకు వెళ్లిన మూడేళ్ళ పిల్లాడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దానికి వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమాన పడ్డ బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో తీవ్రంగా వెతికారు. అయితే అక్కడ లోతైన డ్రైనేజీ గుంతలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు పాఠశాలకు నిప్పు పెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులతో కలిసి రోడ్డుపై అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పాఠశాలకు వెళ్లే రోడ్డును బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూల్ దగ్గరకి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే అందులో.. బాబు పాఠశాలలోకి వెళ్లినట్లు రికార్డ్ అయింది కానీ, బయటకు వచ్చనట్లు కనిపించలేదు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పాట్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్ర ప్రకాశ్ తెలిపారు.