మహిళా ఐపీఎస్‌ను వేధించిన సీనియర్‌ ఐపీఎస్‌కు మూడేండ్ల జైలుశిక్ష

తమిళనాడు రాష్ట్ర ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర ఐపీఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తమిళనాడులో చోటు చేసుకున్నది. తమిళనాడులోని ఒక అదనపు డీజీ స్థాయి అధికారి రాజేశ్‌ దాస్‌కు అక్కడి సెషన్స్‌ కోర్టు మూడేండ్ల జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం ఇచ్చిన సంచలన తీర్పు రాష్ట్ర ఐపీఎస్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వివరాళ్లోకెళ్తే.. 2021లో చెంగల్‌పట్‌లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బహిరంగ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి స్థానిక మహిళా ఎస్పీ తన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అదనపు డీజీ రాజేశ్‌ దాస్‌తో కలిసి కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కారులో తన పక్కన కూర్చున్న ఆ మహిళా ఐపీఎస్‌ను రాజేశ్‌దాస్‌ లైంగికంగా వేధించాడు. దానితో ఆమె కారు ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించి కిందికి దిగిపోయి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఐపీఎస్‌ అధికారి ఖండన్‌.. ఆమెను ఫిర్యాదు చేయకుండా నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం దృష్టికి బాధితురాలు తీసుకెళ్లగా ఏడుగురు సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఉదంతంపై విచారణ జరిపించి రాజేశ్‌దాస్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ కేసును విచారించిన మద్రాసు సెషన్సు కోర్టు నిందితుడిగా తేలిన రాజేశ్‌దాస్‌కు మూడేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాను విధించింది. అలాగే, బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న మరో ఐపీఎస్‌ అధికారి ఖండన్‌కు రూ.500 లు జరిమానాను విధించింది.
ఈ ఘటన తెలంగాణ రాజేశ్‌దాస్‌ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులతో పాటు మరికొందరు ఐపీఎస్‌ అధికారులలో చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలను కాపాడి మహిళలకు భద్రత కల్పించాల్సిన ఐపీఎస్‌ అధికారులే తోటి మహిళా ఐపీఎస్‌ అధికారిని లైంగికంగా వేధించటం క్షమార్హం కాని నేరంగా పరిగణించాలని కొందరు మహిళా ఐపీఎస్‌ అధికారులు అభిప్రాయపడ్డారు.

Spread the love