జాగ్రన్‌ లేక్‌సిటీ యూనివర్సిటీ క్యాంపస్‌లో పులి సంచారం…

నవతెలంగాణ – భోపాల్‌: యూనివర్సిటీ క్యాంపస్‌లో పులి సంచరించింది. మెయిన్‌ గేట్‌తోపాటు వీసీ చాంబర్‌ వద్ద అది తిరిగింది. అక్కడున్న వారు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌ శివారు ప్రాంతంలో జాగ్రన్‌ లేక్‌సిటీ ప్రైవేట్‌యూనివర్సిటీ ఉన్నది. శనివారం రాత్రివేళ ఆ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ఆడ పులి చొరబడింది. మెయిన్‌ గేట్‌తో పాటు వీసీ క్యాబిన్‌ వద్ద అది సంచరించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు పులిని చూసి భయాందోళన చెందారు. భయంతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, ప్రైవేట్‌ యూనివర్సిటీలో సంచరించిన ఆడ పులి టీ 123 అని అటవీశాఖ అధికారి అలోక్ పాఠక్ తెలిపారు. దానికి నాలుగు పిల్లలు ఉన్నాయని చెప్పారు. ఎనిమిది నెలల వయసున్న పిల్లలతో కలిసి అది అటవీ ప్రాంతం శివారులో తిరుగుతున్నదని అన్నారు. ఇటీవల ఒక డెయిరీ ఫామ్‌ వద్ద ఆవుపై దాడి చేసిందని, మిగతా పశువులు ప్రతిఘటించగా అక్కడి నుంచి పారిపోయిందని వెల్లడించారు. మరోవైపు యూనివర్సిటీలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love