పులి వన్నె మేక

పులి వన్నె మేక”వాడికొచ్చిన వయసు ఎవడికొచ్చింది. మనిషి మానులా ఎదిగాడు. సభ్యత, సంస్కారం, ఏమాత్రం లేని మనిషి. తనకి కూడా పిల్లలూ, మమనమలు ఉన్నారు. ఛీ!ఛీ! మనమరాలు వయసు ఉన్న పిల్లతో సరసాలు, తైతక్కలూనా!? మనిషికి సిగ్గు, లజ్జ ఉండాలి. మనిషి పుట్టుక పుట్టిన తరువాత, కాస్త మంచీమర్యాదా ఉండాలి. అయినా ఈరోజుల్లో మనుషులు, పశువులు కన్నా హీనంగా తయారు అవుతున్నారు” ఫ్లాట్‌ నెంబర్‌ 101లో ముసలావిడ, రోప్పుకుంటూ, ఆయాసపడుతూ అంటున్న మాటలు ఫ్లాట్‌ నెంబర్‌ 102 లో కుర్చున్న నాకు, మైథిలికి స్పష్టంగా వినపడుతున్నాయి.
మైథిలి భయంగా, కంగారుగా నా వైపు చూసింది. నేను ‘నువ్వేమీ ఫీల్‌ అవకు, ఇదంతా మమూలే’ అన్నట్టు సంజ్ఞ చేసాను. మైథిలి ఇంకా అసౌకర్యంగానే ముఖం పెట్టి, పక్క ఫ్లాట్‌ వైపు చూస్తోంది. అక్కడ గుమ్మంలో నించున్న ముసలావిడ లీలగా కనిపిస్తోంది.
”రా మైథిలి అలా బెడ్‌ రూంలో కూర్చుందాం” అన్నాను నేను కాస్త గట్టిగా, నా మాటలు ఆ ఫ్లాట్‌లో ఉన్న ఆవిడకి వినిపించేలా. నా మాటలు ఇంకా పూర్తి కాకుండానే బయట పెద్దగా కేకలు వినిపించాయి.
”సార్‌…. వెళ్ళిపొండి. అనవసరంగా పెద్ద గొడవ అయ్యేలా ఉంది” అంది మైథిలి దిగులుగా ముఖం పెట్టి.
”మైథిలి నీకు ముందు ఒకసారి చెప్పాను. ఏనుగులు నడుస్తూ ఉంటే, కుక్కలు వెంట పడి మొరుగుతాయని. ఏనుగుల గొప్పతనానికి గాని, గౌరవానికి గాని ఏమీ భంగం వాటిల్లదు కదా” అన్నాను నేను మైథిలికి ధైర్యం చెపుతూ.
”మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ నన్ను వీళ్ళు బతకనివ్వరు” అంది ఇబ్బందిగా ముఖం పెట్టి.
”ఏమీ పరవాలేదు. నేను చూసుకుంటాను” అన్నాను మైథిలి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి.
”హవ !! పట్టపగలే శంగారం వెలగబెడుతున్నాడు. బెడ్‌ రూంలోకి దూరి… చెప్పడానికి నాకే అదోలా ఉంది. మరి ఆ మనిషికి మనసు ఎలా ఒప్పుతోందో. అయినా మహాత్ములు ఏనాడో అన్నారు… కామాతురాణాం నలజ్జ, నభయం అని. అయినా ఇవి సంసారులు ఉండే ఫ్లాట్లా, సరససల్లాపాలు ఆడుకునే సానులు ఉండే కొంపా? ఆ పెద్దాయనికి బుద్ధి లేకపోతే లేదు. ఈ పిల్లకన్నా ఉండక్కర్లా!? కాటికి కాళ్ళు చాపుకు కూర్చున్న వాడితో, అక్రమ సంబంధం పెట్టుకోడానికి సిగ్గు లేదూ. అయినా మళ్ళీ అస్తమాను, తాను మహా తెలివైన దాన్నని చెప్పుకుంటుంది. ఇవేనేమిటి చచ్చు తెలివితేటలు” అంటూ పెద్దగా అరవడం ప్రారంభించింది ముసలావిడ.
ఆ రోజు ఆదివారం కావడం వలన చుట్ట పక్కల ఫాట్లలో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, చాలా మంది ఫ్లాట్‌ 102 ముందు పోగయ్యారు.
ఇద్దరు ఆడవాళ్ళు ధైర్యం చేసి నేను, మైథిలి కూర్చున్న రూంలోకి వచ్చారు. ఇద్దరికీ కూడా వయస్సు దాదాపు నలభై అయిదు, ఏభై మధ్య ఉంటుంది. నెరిసిపోతున్న జుట్టుకు రంగు వేసుకున్నారు. ముఖంలో కూడా వయస్సు కనిపించకుండా, దట్టంగా అలంకరణ చేసుకున్నారు. వాళ్ళని చూసేసరికి ఎందుకో నాకు గౌరవ భావం కలగలేదు!?
”సార్‌… మీరు చేస్తున్న పని ఏమీ బాగోలేదు. మీరు పెద్దవారు. ఆ అమ్మాయి… మరి మీ వలలో ఎలా పడిందో! ఇక్కడితోనన్నా మీరు చేస్తున్న తప్పుడు పని మానేసేయ్యండి” అంది అందులో ఒకావిడ.
ఆవిడ మాటలకి నా కోపం నషాళానికి అంటింది. అయితే అప్పటికి నిగ్రహించుకున్నాను. ఎందుకంటే కోపం తెచ్చుకుంటే శారీరకంగా, మానసికంగా నాకే నష్టమని తెలుసు. అలాగే కోపం వస్తే, నా నాలుక, నా మెదడు కన్నా, వేగంగా పని చేస్తుందని తెలుసు. ఆ పరిస్థితి, నన్ను అనవసరంగా, ప్రమాదంలో ముంచెత్తుతుంది.
వీలయినంత నెమ్మదిగా ”ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా?” అని అడిగాను.
”నేను ఈ ఫ్లాట్స్‌ ఓనర్స్‌ అసోషియేషన్‌కి సెక్రటరీ. పేరు నీరజ. ఆవిడ పేరు సంధ్య. ఈ కాలనీ మహిళా సంఘం అధ్యక్షురాలు. మా ఫ్లాట్స్‌లోనే ఉంటుంది” అందావిడ.
”చూడండి, మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని మేం సహించం” అంది సంధ్య తీక్షణంగా.
”ఓహో!! ఇంతకీ మీరు ఎవరి పర్మిషన్‌ తీసుకుని, ఈ ఫ్లాట్‌లోకి వచ్చారో తెలుసుకోవచ్చా!? లోపలి వచ్చే ముందు, అనుమతి తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు మీరు అకారణంగా దుర్మార్గం లాంటి పదాలు ఉపయోగించడం, మీ కుసంస్కారాన్ని తెలుపుతోంది” అన్నాను సంధ్య ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
కోపంతో సంధ్య ముఖం కందగడ్డలా ఎర్రగా అయిపోయింది.
”మీరు ఎవరితో మట్లాడుతున్నారో తెలుసా?” అంది సంధ్య.
”ఏ అనుమతి లేకుండా, ఒక ఇంట్లోకి ప్రవేశించి, అర్థంపర్థం లేని మాటలతో అసంబద్ధమైన ఆరోపణలు చేసిన కాలనీ మహిళా సంఘం అధ్యక్షురాలితో” అన్నాను నేను వ్యంగంగా. ”అధ్యక్షురాలితో” అన్న మాట వత్తి పలుకుతూ.
”సార్‌. ఏదో పెద్దవారని ఇంతవరకు మిమ్మల్ని గౌరవించాం. మీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం జాగ్రత్త” అంది నీరజ, కోపంతో ముక్కు పుటాలు అదురుతుండగా.
”నన్ను తరువాత బెదిరిద్దురుగాని… ముందు ఇక్కడకు అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. ఇంతకీ నేను చేసిన ఆ ఘోరాపరాధం ఏమిటి?” అడిగాను.
”చూడు నీరజా, ఏమీ తెలియనట్లు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడో!?” అంది సంధ్య.
”మర్యాద… మర్యాద. నేను మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తే, మీరు ఏక వచనం ప్రయోగించడం తప్పు” అన్నాను మొట్ట మొదటసారి కోపంగా.
”మీలాంటి వ్యక్తులు గౌరవానికి అర్హులు కాదు” అంది నీరజ.
”అంతేలెండి…. సంస్కారాన్ని బట్టి మనం ఇతరులతో వ్యవహరిస్తాం. ఇంతకీ నేను చేసిన ఘోరాపరాధం ఏమిటో?” అన్నాను నీరజ వైపు చూస్తూ.
”మా నోటితో మేమే చెప్పాలా? అన్నెం పున్నెం ఎరుగని ఒక అమ్మాయిని వంచించి, వలలో వేసుకుని… చెప్పడానికి మాకే అసహ్యంగా ఉంది. ఇక మీరు ఎలా చేసారో!?” అంటూ రోతగా ముఖం పెట్టింది నీరజ.
”వెరీ గుడ్‌. మీ ఊహాశక్తికి జోహర్లు. మీరు మంచి రచయిత్రి అవవచ్చు. ఏమీ లేకపోయినా, అద్భుతంగా ఏదో జరిగినట్లు కథ బాగా అల్లారు” అన్నాను నవ్వుతూ.
”ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటూ… ఆ విషయం మేం అడగడం మీకు నవ్వులాటగా ఉందన్న మాట!? ఇంతకీ మీరు కొనసాగిస్తున్న ఈ అక్రమ సంబంధానికి, వెంటనే ముగింపు పలుకుతారా ? లేకపోతే మహిళా కమిషన్‌కి, పోలీసులకి కంప్లైంట్‌ ఇవ్వమంటారా?” అడిగింది సంధ్య.
”ఎట్‌ యువర్‌ విల్‌. కానీ డిఫమేషన్‌ కేసు ఎదుర్కోడానికి మీరిద్దరూ రెడీగా ఉండండి” అన్నాను తాపీగా.
”తప్పు చేసింది మీరు. మా మీద కేసు ఏంటి?” అంది సంధ్య.
”ఏదో నిరాధారమైన ఆరోపణలు చేసి, కేసులు గీసులు అంటూ బెదిరించినందుకు. ఆ ఆరోపణలతో నా వ్యక్తిత్వ గౌరవానికి భంగం కలిగించినందుకు. అసలు ఏ అనుమతి లేకుండా, మైథిలి ఫ్లాట్‌లోకి దౌర్జన్యంగా చొరబడినందుకు. నేను ఒక అడ్వకేట్‌ని. ఐయాం రిప్రజెంటింగ్‌ మైథిలి” అన్నాను గొంతు పెంచి.
ఆ మాటలకి కాస్త కంగు తిన్నారు నీరజ, సంధ్య. అంతలో ఇంచుమించు ఎనభై సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు.
”సార్‌. ఇందాకటి నుంచీ పిచ్చిగా వాగుతున్నది నా భార్య. దాని నోరు నొక్కి, ఇదుగో ఇలా వచ్చాను. ఇక్కడ అందరూ గుట్టుగా సంసారాలు చేసుకుంటున్న వాళ్ళం. ఆ అమ్మాయిలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండడం, మీరు అస్తమాను అ అమ్మాయి ఫ్లాట్‌ కి రావడం, గంటల తరబడి గడపడం, కాస్త ఇబ్బందిగా ఉంటోంది” అంటూ వినయంగా అన్నాడు.
”నేనుగాని మైథిలి గాని ఎవరికీ ఇబ్బంది కలిగించేటట్లు ప్రవర్తించడం లేదే!?” అన్నాను ఆయనతో.
”అలా కాదండీ. అమ్మాయి పెళ్ళి కాని పిల్ల. ఒంటరిగా ఉంటోంది. మీరు ఆ అమ్మాయి దగ్గరకు వేళా,పాళా లేకుండా రావడం, ఒక్కోసారి అర్ధరాత్రి, అపరాత్రి రావడం, వెళ్ళడం మర్యాద కాదు. మాకు తెలిసినంత వరకు మీకూ ఆ అమ్మాయికి ఎటువంటి చుట్టరికం, బంధుత్వం లేవు. వావీ వరసా లేని సంబంధాలను అక్రమ సంబంధాలు అంటారనే విషయం మీకు తెలియంది కాదు” అన్నాడు ఆయన మళ్ళీ మెల్లిగానే.
”అలా చెప్పండి బాబయ్య గారు. మీలాంటి వాళ్ళు గడ్డి పెడితేనన్నా ఆయన చేస్తున్న వెధవ పని ఆయనకు తెలిసివస్తుందేమో” అంది సంధ్య అక్కసుగా.
”నేను చేస్తున్నది వెధవ పని కాదు కానీ… మీరు చేస్తున్న పనులు బయట పెడితే… మీ భర్తలు మిమ్మల్ని వదిలేయడం, మీ సంసారాలు రోడ్డున పడడం ఖాయం” అన్నాను కంటి చివరగా నీరజని, సంధ్యని చూస్తూ.
”ఏమిటండీ మీ ఉద్దేశ్యం? మేం మీలా అసహ్యకరమైన సంబంధాలు పెట్టుకుని, అక్రమమైన పనులు చేసే వాళ్ళం కాదు. మేమంతా చాలా మర్యాదస్థులం. నోటికొచ్చినట్టు మాట్లాడకండి”అ ంది నీరజ పెద్దగా అరుస్తూ.
‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజం తడుముకుంది’ అని మనస్సులో అనుకుని నవ్వుకున్నాను.
”అవన్నీ ఎందుకమ్మా నీరజా. నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా!?”అన్నాడు పెద్దాయన.
”ముందు కేసు పెడితే గాని ఇటువంటి వాళ్ళ తిక్క కుదరదు. పద సంధ్యా ఇప్పుడే పోలీసు కంప్లైంట్‌ ఇచ్చి, మహిళా కమిషన్‌కి రిపోర్ట్‌ చేద్దాం. అప్పుడు రోగం కుదిరి, దారిలోకి వస్తాడు” అంటూ సంధ్యని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది నీరజ. పెద్దాయన ఏదో అనబోతున్నా, వినిపించుకోకుండా ఆ ఇద్దరూ వెళ్ళిపోయార .
నేను పెద్దాయినకి ‘ఊర్కోండి’ అన్నట్లు సంజ్ఞ చేసాను.
0000
నీరజ, సంధ్య అన్నంత పని చేసారు. ఎంక్వైరీ కోసం పోలీసులు వచ్చారు. వాళ్ళకి చెప్పాల్సిన విధంగా, చెప్పాల్సిన విషయాలు చెప్పాను. వాళ్ళకు, అసలు విషయం అర్థం అయి వెళ్ళిపోయారు.
జిల్లా మహిళా సంఘం వాళ్ళు, ‘మాట్లాడుదాం’ రమ్మని కబురు పంపించారు. నేను వెళ్ళాను. నాతోబాటు మైథిలిని కూడా తీసుకెళ్ళాను. నీరజ, సంధ్య కూడా అక్కడకి వచ్చారు.
అక్కడ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.
ఆవిడ మైథిలి వంక అదోరకంగా చూసి, ఇబ్బందిగా ముఖం పెట్టింది. అయితే ఆ విషయం నేను కానీ, మైథిలి కానీ పట్టించుకోలేదు. పరిచయాలు అయ్యాయి .కొంతసేపు ఏదో సామాన్య విషయాలు చర్చించి, తరువాత అసలు విషయంలోకి దిగాం.
”మేడం. నేను ఒక అడ్వకేట్‌ని. అంతకన్నా ముందు ఒక బాధ్యత కల పౌరుణ్ణి. ప్రేమించే భర్తని. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునే ఇద్దరు కూతుళ్ళ తండ్రిని. అసలు కలలో కూడా నా మీద కంప్లైంట్‌ వచ్చిన విధంగా ప్రవర్తించను” అన్నాను.
”నిజమే అనుకోండి, కానీ పరిస్థితులు…” అంది ఆవిడ.
”నిజమే లెండి. ఆ పరిస్థితులు, అభూత కల్పనలకి ఆస్కారం ఇచ్చాయి. నేను చేసిన పని, ఎంత రిస్క్‌తో కూడుకున్నదో నాకు తెలుసు. జరిగిన, జరుగుతున్న విషయం విన్న నా కుటుంబ సభ్యులు నన్ను ఎంత అసహ్యంగా, నీచంగా చూస్తారో కూడా నాకు తెలుసు. అలాగే ఆ ఫ్లాట్లో చుట్టు పక్కల వాళ్ళు, మైథిలిని ఎంత అవమానకరంగా ట్రీట్‌ చేస్తారో, ఎంతగా బాధలకు, వ్యధలకు గురిచేస్తారో, ఎన్ని సూటీపోటీ మాటలతో చిత్ర వ్యధ చేస్తారో ఊహించగలను. అయినా నేనెందుకు అలాంటి పని చేసుటానో ఊహించండి” అన్నాను.
”అదే నాకు అర్థం కావడం లేదు!!” అంది జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు.
నేను నవ్వి, గొంతు సవరించుకుని, జరిగింది వివరించడం మొదలు పెట్టాను.
”మైథిలి కంప్యూటర్‌ ఇంజనీర్‌. మంచి ఉద్యోగం చేస్తోంది. ఆ అమ్మాయి ఉద్యోగం చేసే చోట, ఇంకో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిచయమయ్యాడు. సహజంగా ఇద్దరి మధ్య ఆకర్షణ, కొన్నాళ్ళకు స్నేహంగా, స్నేహం ప్రేమగా మారింది. అయితే మైథిలి నేటి సగటు అమ్మాయి చేసే పొరపాటే చేసింది. అతనిని పూర్తిగా నమ్మింది. అతనికి తన మనస్సు, శరీరం కూడా అర్పించింది. అతను మోసం చేశాడు. నేను ఒక రోజు ఊరి చెరువు పక్కగా వెళుతుంటే, మైథిలి ఆత్మహత్య ప్రయత్నం చేయబోవడం చూశాను. వెంటనే మైథిలిని ఆ పని చేయకుండా ఆపాను. చాలాసేపు ఆ అమ్మాయితో మాట్లాడి, అన్ని విషయాలు బోధపరిచాను. జీవితం ఎంత గొప్పదో తెలియచెప్పాను. భగవంతుడు ఇచ్చిన జీవితం అంతం చేసుకోవడం పాపమే కాక, దేవుని పట్ల ద్రోహం అవుతుందన్నాను. తనకి తండ్రి లాంటి వాడినని, నా మీద ప్రేమతో, గౌరవంతో, ఇక జన్మలో, అటువంటి పిచ్చి ప్రయత్నం చేయనని, మైథిలితో ఒట్టు వేయించుకున్నాను. మైథిలికి నామీద మంచి అభిప్రాయం కలిగింది. అలాగే నామీద నమ్మకం కుదిరింది. తరువాత మైథిలిని ఫ్లాట్లో దింపి వచ్చాను.
కొన్ని రోజుల తరువాత ఒక రాత్రి వేళ మైథిలి నాకు ఒక వీడియో మెసెజ్‌ పెట్టింది. మళ్ళీ దిగులుగా ఉందని,ఏవో ఆలోచనలు వస్తున్నాయని ఆ మెసేజ్‌ సారాంశం. వెంటనే వస్తున్నానని చెప్పాను.
ఆ రాత్రి మైథిలి దగ్గరికి వెళ్ళి, ధైర్యం చెపుతూ కూర్చున్నాను. చాలాసేపటికి మైథిలి కన్విన్సు అయ్యింది. అప్పటికి ఇంచుమించు తెల్లారిపోయింది. ఇంటికి వెళ్ళగానే, ఇంట్లో వాళ్ళు నేను చెప్పిన మాటలను నమ్మకుండా, నన్ను అనుమానించారు. క్రమంగా అది బలపడింది. ఒక స్టేజిలో నా భార్య ‘ఎవత్తది!?’అని అడిగేసింది. నవ్వేసి ఊరుకున్నాను. మైథిలి పరిచయమై ఆరు నెలలయ్యింది. ఇప్పుడు మైథిలి మానసికంగా పూర్తిగా కోలుకుంది. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని ఇచ్చి త్వరలో పెళ్ళి కూడా చేయబోతున్నాను. ఆ పెళ్లయ్యాక అందరికీ విషయం చెబుదామనుకున్నాను. ఇంతలో ఆ సంఘటన జరిగి, ఇలా మీకు అంతా వివరించాల్సి వచ్చింది”
నా మాటలు విన్న ఆవిడ నివ్వెరబోయింది. నాతో వచ్చిన మైథిలి నేను చెప్పినది నూటికి నూరు శాతం నిజమేనని తన మాటల ద్వారా ధృవీకరించింది.
”మీ ఇద్దరూ కలిసి అబద్ధం చెప్పడంలేదని నమ్మకం ఏమిటి?” అంది జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు.
”చూడండి మీరు జడ్జి స్థానంలో కూర్చున్నారు. నేను అడ్వకేట్‌ స్థానంలో ఉండి అంతా మీకు వివరించాను. ఇక విట్నెస్‌ అనుకుంటారో, బాధితురాలు అనుకుంటారో, మైథిలి తన వెర్షన్‌ చెప్పింది. మీరే నిర్ణయించండి మేడం. ది బాల్‌ ఈజ్‌ ఇన్‌ యువర్‌ కోర్టు” అన్నాను.
ఆ తరువాత ఆవిడ చాలా సేపు ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తల ఆడించింది.
”మీ ఇద్దరూ చెబుతున్నది నిజం అని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది సార్‌. బో త్‌ అఫ్‌ యు ఆర్‌ టోటల్లీ ఇన్నోసెంట్‌” అంది.
ఆ తరువాత తల తిప్పి ”చూడండి నీరజ, సంధ్య… మీకు వయస్సు వచ్చింది కానీ పరిపక్వత రాలేదు. అన్నీ సరిగ్గా చూడకుండా, వెరిఫై చేయకుండా ఆయన మీద కంప్లైంట్‌ ఇచ్చారు. వజ్రాన్ని చూసి బొగ్గు అనుకున్నారు. ఇప్పటి నుంచన్నా, కాస్త విశాలంగా ఆలోచించడం నేర్చుకోండి. సారీ సార్‌. మిమ్మల్ని అనవసరంగా ట్రబుల్‌ చేశాను” అంది జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు, క్షమాపణ ధ్వనించే కంఠంతో.
నీరజ, సంధ్య ముఖాల్లో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. సహజం.
”ఇట్‌ ఈజ్‌ అల్‌ రైట్‌” అంటూ మైథిలితో బయటకి నడిచాను.
– ఎం.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌, 98490 13002

Spread the love