– ఏఐఐఈఏ నిర్విరామ కృషి ఫలితంగానే 17శాతం వేతన సవరణ
– ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలి
– ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
– ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలి : ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ)..
– జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్
– ఘనంగా యూనియన్ 28వ వార్షిక మహాసభ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ కరీంనగర్
దేశాన్ని, ప్రజల్ని మతం ప్రాతిపదికగా విభజించి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న నీచమైన రాజకీయాలు ఇక ఎంతమాత్రం చెల్లవని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) జోనల్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఎల్‌ఐసీలోని అతిపెద్ద యూనియన్ ఏఐఐఈఏ కరీంనగర్ డివిజన్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ 28వ మహాసభలు ఆదివారం అట్టహాసంగా కరీంనగర్ జిల్లా కేంద్రలంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు జి.రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన హాజరై ప్రారంభించి మాట్లాడారు. దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎన్నికలను ఇంత అట్టడుగు స్థాయికి దిగజారేలా ఒక ప్రధానమంత్రి ప్రజలను ఆకర్షించడానికి మతాన్ని ఒక కీలకమైన అంశంగా తన ఉపన్యాసాల్లో ప్రస్తావిస్తూ ప్రజల్ని అవమానపరిచేలా, కించపరిచేలా వ్యవహరించడం వివాదాస్పదమైందన్నారు. అయినా చైతన్యవంతమైన ప్రజలు ఏ విభజన రాజకీయాలకు తావివ్వకుండా 400 సీట్లను ఆశించిన బీజేపీకి భంగపాటు కలిగించే విధంగా 240 సీట్లకు పరిమితం చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక గొప్ప మార్పునకు సంకేతంగా భావించాలని తెలిపారు. అలాగే ఒక బలమైన ప్రతిపక్షం ఆధ్వర్యంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి రక్షణ కలుగుతుందనే నమ్మకం బలపడిందని తెలిపారు.
ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పరిమితమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ఇన్సూరెన్స్‌లో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ద్వారా తీసుకొచ్చే మార్పులన్నీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీని నిర్వీర్యం చేస్తూ ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టని ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోయినా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ఎల్‌ఐసీ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని తెలిపారు. ఏఐఐఈఏ నిర్విరామ కృషి ఫలితంగానే 17శాతం వేతన సవరణ సాధించుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వేతన సవరణకు ఆయువుపట్టు లాంటి బేసిక్ లోడింగ్‌లో తిరుగులేని పురోగతి సాధించుకున్నట్టు చెప్పారు. బీమా తదితర రంగాల్లో పెను సంక్షోభం ఏర్పడుతుందని, ప్రజాస్వామిక హక్కుల్లో భాగమైన ట్రేడ్ యూనియన్ హక్కుల ఉల్లంఘనపై సమిష్టి పోరాటం చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని, మద్దతును కాపాడుకుంటూ ప్రభుత్వ కుట్రల నుంచి ఎల్‌ఐసీని రక్షించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి 74 సంవత్సరాలుగా కృషిచేస్తున్నట్టు తెలిపారు.
రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపోరాటాల ముందు ఏ ప్రభుత్వమైనా దిగదుడుపే అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐతో దాడులు చేయిస్తూ, అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. ఎల్‌ఐసీని నిర్వర్యం చేసే కుట్ర జరుగుతుందని, దాన్ని కాపాడుకోవడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ మహాసభలు పలు తీర్మానాలు చేశారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మీద విధిస్తున్న 18శాతం జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని, ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. క్లాస్ 3, 4 క్యాడర్లలో ఉద్యోగ నియామకాల్ని వెంటనే చేపట్టాలని, ఏఐఐఈఏకు వెంటనే గుర్తింపు ఇవ్వాలని, కార్మికులకు రూ.26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని తీర్మానం చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఐసీఈయూ కరీంనగర్ డివిజన్ నూతన అధ్యక్షునిగా ఎ.రామ్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శిగా వి.వామన్‌రావు, ఉపాధ్యక్షులుగా డి.సూర్యకళ, సంయుక్త కార్యదర్శులుగా పి.బసవేశ్వర్, సి.అనుపమ, ఆర్.రాజేశం, కోశాధికారిగా యం.శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, పదవీ విరమణ పొందిన ప్రస్తుత అధ్యక్షులు రవీంద్రనాథ్‌ను ఈ సందర్భంగా జోనల్, డివిజనల్ నాయకత్వం అన్ని శాఖల నాయకులు, సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ మహాసభలో.. యూనియన్ జోనల్ అధ్యక్షులు పి.సతీష్, సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, కోశాధికారి శ్రీనివాసన్, సికింద్రాబాద్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి రఘు, ఎల్‌ఐసీ క్లాస్1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.సత్యనారాయణ, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ సంఘం నాయకుడు వాసుదేవరెడ్డి, ఏజెంట్ సంఘం నాయకులు గట్టు రాజయ్య, సీఐటీయూ నాయకుడు రమేష్, బ్యాంక్ అధికారుల సంఘం నాయకుడు దామోదర్, ఎల్‌ఐసీ ఓబీసీ సంఘం నాయకులు సత్తయ్య, ఎల్‌ఐసీ వాలిక్ సంఘ నాయకులు బుచ్చయ్య, ఎల్‌ఐసీ పెన్షనర్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా 13 ఎల్‌ఐసీ బ్రాంచ్‌ల నుంచి నాయకులు, సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు.