పీఆర్సీ కమిటీకి వేళాయే?

– ఈసారి ఐఆర్‌ ప్రకటించే అవకాశం
– ఎన్నికల తర్వాతే ఫిట్‌మెంట్‌
– పకడ్బందీగా ఈహెచ్‌ఎస్‌ అమలు
– ప్రభుత్వ సమాలోచన
– 31న మంత్రివర్గంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆశలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని త్వరలోనే ఏర్పాటు చేసే అవకాశమున్నది. ఇందుకోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, మాజీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే పలువురి పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పీఆర్సీ కమిటీ వేసినా నివేదిక రావడానికి ఆలస్యమవుతుంది. దీంతో ఈసారి మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంటే 2018 తెలంగాణ మొదటి పీఆర్సీలో ఐఆర్‌ ప్రకటించకుండానే నేరుగా ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను అమలు చేసింది. ఇప్పుడు అలా కాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టే చర్యలకు పూనుకుంటున్నది. అందులో భాగంగానే ఐఆర్‌ ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఐఆర్‌ ఎంత ఇస్తే, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న లెక్కలను ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే రూపొందించినట్టు తెలిసింది. ఆ వివరాలను ఈనెల 31న జరిగే మంత్రివర్గంలో చర్చించే అవకాశము న్నది. అందుకే పీఆర్సీ, ఐఆర్‌ ప్రకటన వంటి అంశాల నేపథ్యంలో మంత్రివర్గంపై ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఐఆర్‌ ప్రకటించి ఎన్నికల తర్వా త ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రివర్గంలో చర్చించి అదేరోజు నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేదంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వాత సమావేశాన్ని నిర్వహించి ప్రకటిస్తారా? అన్నది చర్చనీయాంశంగా ఉన్నది. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ముందు ఐఆర్‌ తీసుకుని ఆ తర్వాత మంచి ఫిట్‌మెంట్‌ ఇస్తామంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సీఏం చెప్పే అవకాశమున్నది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను పకడ్బందీగా అమలు చేసేం దుకు ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తున్నది. ఈ విషయంపైనా ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలకు వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఐఆర్‌ అమలు ఎప్పటినుంచి?
‘తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018, జూన్‌ 2న మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటన చేస్తాం. ఆగస్టు 15 నాటికి పీఆర్సీ నివేదిక ఇవ్వడంతోపాటు అమలు కావాలి.’అంటూ 2018, మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అందుకనుగుణంగానే తెలంగాణలో మొదటి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని 2018, మే 18న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి పీఆర్సీ కమిటీ చైర్మెన్‌గా ఐఏఎస్‌ మాజీ అధికారి సిఆర్‌ బిశ్వాల్‌, సభ్యులుగా ఐఏఎస్‌ మాజీ అధికారులు సి ఉమామహేశ్వరరావు, మహమ్మద్‌ అలీ రఫత్‌లను నియమించింది. 2018, జులై ఒకటి నుంచి కొత్త వేతనాలు అమలు కావాలి. కానీ తెలంగాణ మొదటి పీఆర్సీనిఐఆర్‌ ప్రకటించకుండా 30 ఫిట్‌మెంట్‌తో 2020, ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు 22 నెలలపాటు ఆర్థిక ప్రయోజనాన్ని నష్టపోయారు. 2023, జూన్‌ 30 నాటికి తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు ముగిసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త వేతనాలు అమలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కమిటీని నియమించలేదు. పీఆర్సీ కమిటీ వేయకుండా ఐఆర్‌ ఇవ్వలేమంటూ గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీని వేసినా ఐఆర్‌ ఎప్పటినుంచి అమలవుతుందన్న ప్రశ్న తలెత్తు తున్నది. ప్రభుత్వానికి అవసరం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు ఐఆర్‌ను ప్రకటిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఐఆర్‌ ప్రకటించినా ఎన్నికల నాటికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అది మరిచిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రకటిస్తే అటు ప్రభుత్వానికి ఓట్లు, ఇటు ఉద్యోగులకు ఐఆర్‌ ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. తొమ్మిదో పీఆర్సీలో 22 శాతం ఐఆర్‌, 39 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. పదో పీఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. తెలంగాణ మొదటి పీఆర్సీ 2018, జులై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నా ఐఆర్‌ లేకుండానే 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేసింది.

Spread the love