– మణిపూర్ వెళ్లడానికి లేదా?
– మోడీకి సీతారాం ఏచూరి సూటిప్రశ్న
– బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
– నాలుగు రాష్ట్రాల్లో కాషాయపార్టీకి ప్రతికూల ప్రభావం
– ఖమ్మంలో సీటివ్వకుండా పొత్తు ఎలా సాధ్యం
– పొత్తు ఎందుకు కుదర్లేదో కాంగ్రెస్‌నే అడగాలి
– సుప్రీం తీర్పును గవర్నర్లు అమలు చేయాలి
– మోటార్లకు మీటర్లను వ్యతిరేకిస్తున్నాం
– అభ్యర్థులకే కాదు పార్టీల ఖర్చుపైనా పరిమితి ఉండాలి : టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో మీట్ ద మీడియా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి సమయమున్న ప్రధాని మోడీకి మణిపూర్‌కు వెళ్లడానికి తీరికలేదా?అని సీపీఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూటిగా ప్రశ్నించారు. దేశంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీట్ ద మీడియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూల ప్రభావముందని చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని వివరించారు. రాజస్థాన్‌లో పోటాపోటీ ఉంది కానీ బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవని విమర్శించారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రజల్లో తీవ్రంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వంలో ఎవరికీ జవాబుదారీతనం లేదన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌కు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. ఆ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని అడిగారు. మోడీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా ఈసీ నోటీసులు ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలకు మాత్రం వెంటనే నోటీసులు ఇస్తున్నదని చెప్పారు. తెలంగాణలో పొత్తు ఎందుకు కుదరలేదో కాంగ్రెస్‌నే అడగాలని అన్నారు. తమకు బలమున్న ఖమ్మంలో తమకు ఒక్క సీటూ ఇవ్వకుండా కాంగ్రెస్‌తో పొత్తు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే తాము 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. అయితే తాము పోటీ చేయని చోట బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామనీ, స్థానిక కమిటీలు నియోజకవర్గాల వారీగా నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) పొత్తు లేకుంటే నష్టం వస్తుందన్న భావనలో కాంగ్రెస్ లేదని చెప్పారు. రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ మద్దతును బీఆర్‌ఎస్ తీసుకుంటుందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా, తక్కువ సీట్లు వచ్చినా అధికారంలోకి వచ్చే చరిత్ర బీజేపీకి ఉందని విమర్శించారు. మోడీ కూటమిలో ఈడీ, సీబీఐ ఉన్నాయని వివరించారు. ఈడీ, సీబీఐ, ఈసీ కేంద్రం చేతిలో బందీ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక కమిటీలో సుప్రీంకోర్టు సీజే స్థానంలో ప్రధాని మోడీ సిఫారసు చేసే మంత్రిని చేర్చడం సరైంది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గవర్నర్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారని అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉందనీ, పార్టీల ఖర్చుపై పరిమితి లేదని చెప్పారు. అందుకే రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయని విమర్శించారు. జర్మనీ తరహాలో ప్రభుత్వమే అభ్యర్థులకు ఖర్చు చేసే నిధులను ఇచ్చే పద్ధతి రావాలన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. అసలు వాస్తవమేంటో త్వరలో బయటపడుతుందన్నారు. పోరాడాలంటే ఎర్రజెండా కావాలనీ, ఓటేసేందుకు మాత్రం వేరే పార్టీలను ప్రజలు ఎంచుకుంటున్నారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని వివరించారు. మోటార్లకు మీటర్లను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే కార్యదర్శి బి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.