టీఎంసీ అంటేనే అవినీతి : మోడీ

నవతెలంగాణ  –  పశ్చిమబెంగాల్‌ : పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ (తృణమూల్‌ కాంగ్రెస్‌) అవినీతిపై ప్రధాని మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో 42 సీట్లను గెలిచే లక్ష్యంగా బిజెపి పెట్టుకుందని ఆయన అన్నారు. శనివారం నదియా జిల్లాలో కృష్ణానగర్‌లో జరిగిన బిజోరు సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘టిఎంసి (తు మెయిన్‌ ఔర్‌ కరప్షన్‌) అంటేనే అవినీతి. ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ 400 స్థానాల్లో గెలుస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నా. టిఎంసి అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయం ద్రోహానికి పర్యాయపదం. బెంగాల్‌ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల విసుగు చెందారు.’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సందేశ్‌ఖాలీ మహిళల విషయాన్ని ప్రస్తావిస్తూ.. టిఎంసీ నాయకులు సందేశ్‌ఖాలీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బాధలో ఉన్న తల్లులు, సోదరీమణులకు మద్దతు ఇవ్వడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోంది. తమకు న్యాయం చేయాలని వారు మొరపెట్టుకున్నా టిఎంసి ప్రభుత్వం వినలేదు. ‘మా మటి మనుష్‌’ పేరుతో ఓట్లు దండుకున్నారు. కానీ ఇప్పుడు తల్లులు, అక్కచెల్లెళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే.. నేరస్తుల్ని ఎప్పుడు అరెస్టు చేయాలో వారే నిర్ణయిస్తారు.’ అని మోడీ విమర్శించారు.

Spread the love