విజయంతో ముగించాలని!

with success To finish!– నేడు కెనడాతో భారత్‌ పోరు
– గ్రూప్‌ దశలో రోహిత్‌సేన చివరి పోరు
– మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశను అజేయంగా ముగించేందుకు టీమ్‌ ఇండియా ఎదురుచూస్తుంది. గ్రూప్‌-ఏలో వరుసగా ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికాలను చిత్తు చేసిన భారత్‌ నేడు పసికూన కెనడాతో తలపడనుంది. అమెరికాతో మ్యాచ్‌లో తరహాలోనే నేడు కెనడా జట్టులోనూ భారత సంతతి ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. అయితే, గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచే భారత ప్లాన్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. నేడు భారత్‌, కెనడా మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
నవతెలంగాణ-లాడర్‌హిల్‌
పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ తొలిసారి మరో స్టేడియంలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వార్మప్‌ మ్యాచ్‌ సహా గ్రూప్‌-ఏ దశలో మూడు మ్యాచులను టీమ్‌ ఇండియా న్యూయార్క్‌లోని నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియంలోనే ఆడేసింది. వార్మప్‌ సహా మూడు మ్యాచుల్లోనూ మెరుపు విజయాలు నమోదు చేసింది. ఆరు పాయింట్లతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్‌ ఇండియా ఇప్పటికే సూపర్‌ 8 బెర్త్‌ సొంతం చేసుకుంది. సూపర్‌8లో అడుగుపెట్టేందుకు గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో విజయం సాధించటంపై భారత్‌ ఇప్పుడు కన్నేసింది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌ స్టేడియంలో నేడు కెనడాతో భారత్‌ ముఖాముఖి తలపడనుంది. ప్రపంచ క్రికెట్‌ అగ్రజట్టు భారత్‌తో పసికూన కెనడా తలపడనుండటం ఇదే ప్రథమం. లాడర్‌హిల్‌ వేదికగా భారత్‌, కెనాడా మ్యాచ్‌ నేడు.
యశస్వికి చోటు కష్టమే
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అవుతాడనుకున్న యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌కు నేడు కెనడాతో మ్యాచ్‌లోనూ చోటు లభించటం కష్టంగానే కనిపిస్తోంది. భారత్‌ ఇప్పటికే సూపర్‌8కు చేరుకోవటంతో పసికూన కెనడాతో మ్యాచ్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వటం ఆనవాయితీ. కానీ గ్రూప్‌ దశలో మూడు మ్యాచుల్లోనూ బ్యాటర్లు ఆశించిన ప్రదర్శన చేయలేదు.పేస్‌ స్వర్గధామ పిచ్‌పై బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఫ్లోరిడాలో బ్యాటర్లు పరుగుల వేటలో దూకుడు చూపించాలని అనుకుంటున్నారు. దీనికి తోడు ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. నేడు కెనడాతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కచ్చితంగా ఆడనున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకుంటే తప్ప యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో చోటు దక్కటం కష్టమే. వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌ సైతం తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌. నేడు పంత్‌ విశ్రాంతి తీసుకుంటే సంజు శాంసన్‌కు పిలుపు దక్కొచ్చు. ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా సహా శివం దూబె, హార్దిక్‌ పాండ్యలు సైతం బ్యాట్‌తో మెరవాలని ఆశిస్తున్నారు. అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌తో కలిసి జశ్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.
కెనడా పోటీ ఇవ్వగలదా?!
పసికూన కెనడా గ్రూప్‌-ఏలో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట పరాజయం చవిచూసింది. పాకిస్థాన్‌, అమెరికా చేతిలో ఓడిన కెనడా.. మరో పసికూన ఐర్లాండ్‌పై విజయం సాధించింది. కెనడా క్రికెట్‌ జట్టు చరిత్రలోనే నేడు అత్యంత కీలక మ్యాచ్‌ ఆడనుంది. అగ్రజట్టు భారత్‌తో ఆడటం కెనడాకు ఇది తొలిసారి. దీంతో ఫలితం గురించి ఆలోచన లేకుండా ఉత్తమ ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తుంది. ఇక కెనడా జట్టులోనూ భారత సంతతి ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఆరోన్‌ జాన్సన్‌, నవనీత్‌, పర్గాట్‌ సహా శ్రేయాస్‌ మోవవ్వ, రవీందర్‌పాల్‌ సింగ్‌లు కెనడాకు కీలకం కానున్నారు. కలీమ్‌ సనా, జెరెమీ, హేలిగర్‌, బిన్‌ జాఫర్‌లు బంతితో ముఖ్య భూమిక పోషించేందుకు ఎదురుచూస్తున్నారు. న్యూయార్క్‌తో పోల్చితే బ్యాటింగ్‌కు కాస్త మెరుగైన లాడర్‌హిల్‌ పిచ్‌పై భారత బ్యాటర్ల దూకుడును నిలువరించటం కెనడా బౌలర్లకు శక్తికి మించిన పని కానుంది.
వర్షం ప్రమాదం
భారత్‌ ఇప్పటివరకు న్యూయార్క్‌లో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఆడింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించిన పిచ్‌పై మెరుగైన ప్రదర్శనతో మూడు విజయాలు సాధించింది. లాడర్‌హిల్‌ పిచ్‌ కాస్త భిన్నంగా ఉండనుంది. పరుగుల వరద పారకున్నా బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమతూకం ఉండనుంది. కానీ వాతావరణ పరిస్థితులు ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇక్కడ నేపాల్‌, శ్రీలంక మ్యాచ్‌ వర్షంతో రద్దు అయ్యింది. ఈ వారం అంతా వరదలతో కూడిన వర్షం సూచనలు ఉన్నాయి. నేడు సైతం భారీ వర్షం సూచనలు ఉన్నాయి. దీంతో భారత్‌, కెనడా మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రతికూల పరిస్థితులతో మ్యాచ్‌ ముందు రోజు టీమ్‌ ఇండియా ప్రాక్టీస్‌ సెషన్‌ సైతం సాధ్యపడలేదని సమాచారం. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబె, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
కెనడా : ఆరోన్‌ జాన్సన్‌, నవనీత్‌ దాలివాల్‌, పర్గాట్‌ సింగ్‌, నికోలస్‌ కిర్టన్‌, శ్రేయాస్‌ మోవ్వ (వికెట్‌ కీపర్‌), రవీందర్‌పాల్‌ సింగ్‌, బిన్‌ జాఫర్‌ (కెప్టెన్‌), కలీమ్‌ సనా, దిలాన్‌, జునైద్‌ సిద్దికి, జెరెమీ గార్డన్‌.

Spread the love