– నేడు బంగ్లాదేశ్‌తో భారత్ పోరు జోరుమీదున్న టీమ్ ఇండియా
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్
పదేండ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించటమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీమ్ ఇండియా.. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్ దిశగా అడుగులు వేస్తోంది. సూపర్8లో తొలి సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్.. నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కంగారూలతో మ్యాచ్‌కు ముందే సెమీస్ బెర్త్ దక్కించుకునేందుకు రోహిత్‌సేన నేడు నార్త్‌సౌండ్‌లో బరిలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ సూపర్8 సమరం నేడు.
నవతెలంగాణ-నార్త్‌సౌండ్
టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత్ మరో సవాల్‌కు సిద్ధమైంది. సూపర్8 దశలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అఫ్గనిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్‌సేన నేడు బంగ్లాదేశ్‌పై గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరోవైపు ఓ ఓటమితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉండటంతో బంగ్లాదేశ్ సైతం నేడు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నార్త్‌సౌండ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ సూపర్8 పోరు నేడు.
కోహ్లి ఫామ్‌లోకి వచ్చేనా?
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు పెద్దగా ఆందోళన లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ బ్యాటింగ్ లైనప్‌లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఫామ్ సమస్యగా మారుతోంది. గ్రూప్ దశ మ్యాచులు పూర్తిగా అమెరికాలో జరుగగా అక్కడ కోహ్లి తేలిపోయాడు. సూపర్8లో అఫ్గనిస్థాన్‌తోనూ కోహ్లి అంచనాలను అందుకోలేదు. కీలక సెమీఫైనల్స్ ముంగిట విరాట్ కోహ్లి పరుగుల వేట సాగిస్తే.. భారత్‌కు తిరుగుండదు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇటీవల మ్యాచుల్లో నిరాశపరిచాడు. సీనియర్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ జోరందుకుంటే భారత్ సులువుగా భారీ స్కోర్లు నమోదు చేయగలదు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబె సహా హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్లుగా ఆశించిన ప్రదర్శన చేస్తున్నారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విభాగానికి వైవిధ్యత తీసుకొచ్చాడు. జశ్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా అద్భుతంగా రాణిస్తున్నారు. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన అనుభవం సైతం ఇప్పుడు సూపర్8లో కలిసొచ్చే అవకాశం ఉంది.
బంగ్లా నిలిచేనా?
బంగ్లాదేశ్ గ్రూప్ దశలో మెరిసినా.. సూపర్8లో భిన్నంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. నార్త్‌సౌండ్‌లోనే వరుసగా రెండో మ్యాచ్ ఆడటం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చే అంశం. కానీ ఆ జట్టులో కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ నజ్ముల్ శాంటో, తౌహిద్ హృదరు మినహా అందరూ నిరాశపరుస్తున్నారు. భారత్‌పై లిటన్ దాస్, షకిల్ అల్ హసన్ సహా మహ్మదుల్లాకు మంచి రికార్డు ఉంది. దీంతో నేడు ఈ ముగ్గురు కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రెహమాన్, మెహిది హసన్‌లతో పాటు మెహిది హసన్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.
పరిస్థితులు
ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియం బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలం. ఇక్కడ ఇప్పటివరకు 200 పైచిలుకు స్కోరు నమోదు కాలేదు. ఇక్కడ జరిగిన టీ20 మ్యాచుల్లో ఎక్కువగా ఓ మోస్తరు స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వాతావరణం సైతం అనుకూలంగానే ఉండనుంది. మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. కానీ మ్యాచ్ రోజు 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్ : హసన్, లిటన్ దాస్, నజ్ముల్ శాంటో (కెప్టెన్), రిషద్, హృదరు, షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మెహెది హసన్, టస్కిన్ అహ్మద్, హసన్ షకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్.