విద్యార్థులను మేధావులుగా మార్చేందుకే..

To make students intellectuals..– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-బోనకల్‌
విద్యార్థులను సమూలంగా మార్చే అద్భుతమైన ఆయుధం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, బోధన, ఆటలు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తు తరాలకు ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యా బోధన అందిస్తామన్నారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంతో పోటీ పడే విద్యార్థులను తయారు చేయటమే ఈ పాఠశాలల ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రూ.73 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది రూ.1100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21,400 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామని, 34,706 మంది ఉపాధ్యాయులకు కోరుకున్న చోటకు బదిలీలు చేశామని తెలిపారు. విద్యారంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.5000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలపై ప్రతిపక్షం అర్థం లేని ఆరోపణలు చేసిందని, ఇది సాధ్యం కాదని ప్రచారం చేసిందని, కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది సాధ్యమేనని నిరూపించిందని తెలిపారు. బోనకల్‌ మండల ప్రాంతం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలతో నిండిపోయిందని, అటువంటి స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

Spread the love