మధ్యప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణకు

To renew Middle East peace talksరష్యా, చైనాల పిలుపు
గాజా : ఇజ్రాయిల్‌ పైన పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూపు హమాస్‌ చేసిన ఆకస్మిక దాడులపైన అత్యవసరంగా చర్చించటానికి సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో రష్యా, చైనాలు మధ్యప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణ జరగాలని వాదించాయి. యుద్ధ విరమణ తక్షణమే జరగటం ముఖ్యం. ఎప్పటినుంచో ఆగిపోయిన అర్థవంతమైన చర్చలు జరగాలంటే కాల్పుల విరమణ అవసరమని రష్యా శాశ్వత ప్రతినిధి వాస్సిలీ నెబెన్జియా భద్రతామండలిలో చేసిన ఉపన్యాసంలో పేర్కొంది. పౌరులపైన జరిగిన దాడులన్నింటినీ రష్యా ఖండించిందని నెబెన్జియా ప్రకటించింది. ప్రపంచం రెండు రాజ్యాల పరిష్కారానికి చొరవ చూపాలని చైనా రాయబారి జాంగ్‌ జున్‌ భద్రతామండలి సమావేశానికి ముందే చెప్పాడు. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేనందున భద్రతామండలి ఎలాంటి సంయుక్త ప్రకటననూ విడుదల చేయలేదు.
పాలస్తీనా సమస్యను పరిష్కరించటంలో అమెరికా పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి చేసిన తీర్మానాలకనుగుణంగా పాలస్తీనా ప్రజలకు ప్రత్యేక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయటం మినహా మరో మార్గంలేదని ఆయన ప్రకటించాడు. మాస్కోలో ఇరాకీ ప్రధాని మహమ్మద్‌ అల్‌ సుడన్‌ తో సమావేశమైనప్పుడు పుతిన్‌ ఈ విషయాలను ప్రస్తావించారు. పాలస్తీనాలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి అమెరికానే ప్రధాన కారణమని అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌ రోవ్‌ ఆరోపించారు. హమాస్‌ దాడిని ఖండించమని 15దేశాల సభ్యత్వమున్న భద్రతామండలిని అమెరికా కోరింది. అనేక దేశాలు అందుకు సమ్మతించాయని, అయితే ఏకాభిప్రాయం లేనందున సంయుక్త ప్రకటనను విడుదల చేయటం సాధ్యపడలేదని అమెరికా ఉప రాయబారి రాబర్ట్‌ ఉడ్‌ అన్నాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చేయనందున పాలస్తీనాలో ఒక హింసాత్మక విషవలయం ఏర్పడిందని అంతకుముందు రష్యా అభివర్ణించింది. మధ్య ప్రాచ్చంలోను, పాలస్తీనా-ఇజ్రాయిల్‌ సమస్యను పరిష్కరించేందుకు నియమించబడిన రష్యా, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఐక్యరాజ్య సమితితో కూడిన గ్రూపును పనిచేయకుండా చేసింది పశ్చిమ దేశాలేనని రష్యా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితికి ఇజ్రాయిల్‌ కూడా కొంతవరకు కారణమని, శాంతి ప్రక్రియను పునరుద్ధరించాలని అరబ్‌ దేశాలు కోరుతున్నాయి.

Spread the love