సేవ చేయటానికా.. సంపద పెంచుకోవటానికా..?

సేవ చేయటానికా.. సంపద పెంచుకోవటానికా..?– గుజరాత్‌ ఎంపీలు వంద శాతానికి మించి పోగేసుకున్నారు : ఏడీఆర్‌ డేటా
గాంధీనగర్‌ : గుజరాత్‌ నుంచి ఎన్నికైన 26 మంది ఎంపీలలో 12 మంది తమ నియోజకవర్గాలకు రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే, 12 మందిలో ఐదుగురి సంపద 2019తో పోలిస్తే 2024లో 100 శాతం కంటే ఎక్కువ పెరిగింది. గెలిచిన 26 మంది ఎంపీల్లో 23 మంది మిలియనీర్లు కాగా, మరో ఐదుగురు నేర చరిత్ర కలిగి ఉన్నారు. మిలియనీర్‌ ఎంపీల సంఖ్య 2014లో 21గా ఉండగా.. 2019లో అది 24కి చేరింది.ఐదుగురు గుజరాత్‌ ఎంపీల సంపద గత ఐదేండ్లలో గణనీయంగా 112 నుంచి 273 శాతం పెరిగిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. భరూచ్‌ నుంచి ఏడుసార్లు గెలిచిన బీజేపీ ఎంపీ మన్సుఖ్‌ వాసవా సంపద అత్యధికంగా 273 శాతం పెరిగింది. 2019లో, ఆయన ఆస్తుల విలువ రూ.68.35 లక్షలుగా ఉన్నది. ఇది ఈ ఏడాది రూ.2.54 కోట్లకు పెరిగింది. అంటే, రూ.1.86 కోట్ల పెరుగుదల నమోదైంది. వాసవ తన ఆదాయాన్ని తన లోక్‌సభ జీతం, బ్యాంకు వడ్డీ, ఇతర వనరులకు ఆపాదించాడు.జామ్‌నగర్‌ మహిళా ఎంపీ పూనమ్‌ మేడమ్‌ 2019 నుంచి రూ.104 కోట్ల ఆస్తులు పెరగటంతో అత్యధిక సంపద సంపాదించిన వారిలో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె సంపద 2019లో రూ 42.73 కోట్ల నుండి 2024లో రూ.147.70 కోట్లకు పెరిగింది. చాలా మంది గుజరాత్‌ బీజేపీ ఎంపీల సంపద పెరుగుతుండగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, నవ్‌సారి ఎంపీ సీఆర్‌ పాటిల్‌ ఆస్తులు క్షీణించటం గమనార్హం. 2019 నుంచి 2024 వరకు ఆయన సంపద 11 శాతం తగ్గింది. 2019లో, పాటిల్‌ ఆస్తుల విలువ రూ.44.60 కోట్లు. కానీ 2024 నాటికి అవి రూ.39.49 కోట్లకు పడిపోయాయి. అంటే, రూ. 5.11 కోట్ల తగ్గుదల కనిపించింది. గాంధీనగర్‌ ఎంపీ అమిత్‌ షా, జునాగఢ్‌ ఎంపీ రాజేష్‌ చుడాసమా, రాజ్‌కోట్‌ ఎంపీ పురుషోత్తం రూపాలా, ఛోటా ఉదరుపూర్‌ ఎంపీ జసు రథ్వా, బనస్కాంత కాంగ్రెస్‌ ఎంపీ జెనిబెన్‌ ఠాకోర్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.2024లో గుజరాత్‌ నుంచి గెలిచిన 26 మంది అభ్యర్థుల్లో ఐదుగురిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఈ సంఖ్య.. 2019లో నాలుగు, 2014లో తొమ్మిదిగా ఉన్నది. 2024లో గెలుపొందిన అభ్యర్థుల్లో (కాబోయే ఎంపీలు) 46 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నారనీ, 31 శాతం మంది తీవ్రమైన ఆరోపణలు ఎదు ర్కొంటున్నారని ఏడీఆర్‌ నివేదిక పేర్కొన్నది. నేర చరిత్ర కలిగిన ఎంపీల శాతం 2019లో 43 శాతం, 2014లో 34 శాతం, 2009లో 30 శాతంగా ఉన్నది.

Spread the love