ముఖాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోవాలని అందరూ కోరుకుంటారు. ముఖం కాంతి వంతంగా కనిపించాలని రకరకాల క్రీములు, చాలా రకాల చిట్కాలు పాటిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఒత్తిడి, అలసట వల్ల త్వరగా వాడిపోతుంది. అలా అయినప్పటికీ అప్పటికప్పుడు తాజాగా అనిపించాలంటే చిన్న చిట్కాలు ఎప్పటికప్పుడు పాటిస్తే ముఖం సహజంగా మెరిసిపోతుంటుంది. అవేంటంటే…
చల్లటి నీటితో… : ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మీరు చేయగలిగే సులభమైన పని ముఖాన్ని చల్లటి నీటితో కడగడం. ఇంటి నుండి బయటకు పోకపోయినా, ముఖం కడుక్కోవడం, శుభ్రంగా ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది రాత్రిపూట చర్మంపై ఉండే అదనపు నూనెను శుభ్ర పరచడానికి సహాయపడుతుంది. అయితే ముఖానికి ఎప్పుడూ సబ్బు వాడకూడదని గుర్తుంచుకోండి.
ఓ గ్లాసు నీటితో రోజు ప్రారంభం… : సహజ సౌందర్యం కోసం, రోజంతా శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యం. సరైన ఆహారం, పానీయాలతో శరీరానికి ఇంధనం ఇస్తుంది. రోజు ఉదయం మేల్కొన్న వెంటనే ఒక గ్లాసు నీటిని తాగడం మంచిది. లేదంటే మంచినీటికి బదులుగా కొద్దిగా నిమ్మరసం, తేనెను కలిపి తీసుకోవచ్చు. ఇది చర్మానికి పోషకాలు, విటమిన్లను అందిస్తుంది. గ్రీన్ టీ, కొబ్బరి నీరు కూడా తాగవచ్చు. ఇవి చర్మంలో చైతన్యం నింపి కాంతివంతంగా ఉంచుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ఐస్ థెరపీ : ఉదయాన్నే చర్మం నిర్జీవంగా అనిపిస్తే ఒక చిన్న క్లాత్‌లో ఐస్ ముక్కను తీసుకుని ముఖంపై సున్నితంగా రుద్దుతూ కొంచెంసేపు మసాజ్ చేసినట్లు చేయాలి. ఇది ముఖానికి సహజమైన గ్లో ఇస్తుంది. ఈ వ్యాయామం లోపలి నుండి మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే యోగా, ఏరోబిక్స్, జుంబా లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేసినా చర్మం మెరిసిపోతుంది.
ఆరోగ్యకరమైన అల్పాహారం : ఆరోగ్యకరమైన అల్పాహారం మంచి చర్మానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం చాలా అవసరం. దీనివల్ల చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.
ముల్తాని మట్టి : వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ముల్తానీ మట్టితో ఫేస్‌పాక్ వేసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇది ముఖం మీది దుమ్ము, ధూళిని తొలగించి, పొడిబారకుండా చర్మాన్ని కాపాడుతుంది.