టాటా మోటార్స్‌కు

– రూ.3,202 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.3,202.2 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకంగా రూ.5,006 కోట్ల నష్టాలు చవి చూసింది. కాగా.. గడిచిన మార్చితో ముగిసిన త్రైమాసికంలోని రూ.5,408 కోట్ల లాభాలతో పోల్చితే 40.7 శాతం తగ్గుదల చవి చూసింది. క్రితం క్యూ1లో టాటా మోటార్స్‌ రెవెన్యూ 42.6 శాతం పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.71,227.76 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఈ ఏడాది మిగితా కాలంలోనూ మెరుగైన ప్రగతిని కనబర్చాలని నిర్దేశించుకున్నామని టాటా మోటార్స్‌ పేర్కొంది. వచ్చే పండగ సీజన్‌లో వాణిజ్య, ప్యాసింజర్‌ వాహన విభాగంలో కొత్త విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తేనున్నామని తెలిపింది.
బజాజ్‌ ఆటో లాభాల్లో 41 శాతం వృద్థి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బజాజ్‌ ఆటో నికర లాభాలు 41.35 శాతం పెరిగి రూ.1,665 కోట్లుగా చోటు చేసుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,173 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.8,005 కోట్ల రెవెన్యూ నమోదు చేయగా.. గడిచిన క్యూ1లో 29 శాతం పెరుగుదలతో రూ.10,310 కోట్ల రెవెన్యూకు చేరింది. మంగళవారం బిఎస్‌ఇలో ఈ కంపెనీ షేర్‌ విలువ 0.82 శాతం తగ్గి రూ.4,843.25 వద్ద ముగిసింది.
ఎజిఐ గ్రీన్‌పాక్‌కు రూ.558 కోట్ల రెవెన్యూ..
ప్రముఖ ప్యాకేజింగ్‌ ఉత్పత్తుల సంస్థ ఎజిఐ గ్రీన్‌పాక్‌ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 7 శాతం వృద్థితో రూ.558 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. పన్ను చెల్లింపులకు ముందు 55 శాతం వృద్థితో రూ.85 కోట్ల లాభాలు ఆర్జించినట్లు పేర్కొంది. గడిచిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేశామని ఎజిఐ గ్రీన్‌పాక్‌ లిమిటెడ్‌ సిఎండి సందీప్‌ సోమాని పేర్కొన్నారు. కంపెనీ అమ్మకాలు, లాభదాయకత పెరిగిందన్నారు.
ఎల్‌అండ్‌టి స్పెషల్‌ డివిడెండ్‌…
ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తమ వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.6 చెల్లించడానికి కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 46.4 శాతం వృద్థితో రూ.2,493 కోట్ల లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,702 కోట్ల లాభాలు నమోదు చేసింది.

Spread the love