నేడే భవితవ్యం

– అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి
– అభ్యర్థులు, అభిమానుల్లో టెన్షన్‌..టెన్షన్‌
– ఖమ్మంలో 72 టేబుల్స్‌..103 రౌండ్లు
– భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తం 82 రౌండ్లు
– రెండు జిల్లాల కేంద్రాల్లో ఒకేచోట లెక్కింపు
తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. నవంబర్‌ 30వ తేదీన ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, అభిమానుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం హవా కొనసాగుతుందని చెబుతుండటంతో ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 48 గంటల ఉత్కంఠకు నేటి మధ్యాహ్నం లోపే తెరపడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 185 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఖమ్మం జిల్లాలో 12,16,796 మంది ఓటర్లు ఉండగా 10,20,087 మంది ఓటర్లు తీర్పునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో 79% మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రౌండ్ల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. ఖమ్మంలో ఐదు నియోజకవర్గాలను 103 రౌండ్లలో లెక్కిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82 రౌండ్లుగా చేపడుతారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లోని సూర్యాపేట హైవే పక్కనున్న శ్రీ చైతన్య సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కిట్స్‌) కళాశాలలో లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెంలో అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొత్తం ఐదు నియోజకవర్గాల లెక్కింపు చేపడుతారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. నవంబర్‌ 30వ తేదీన ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, అభిమానుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం హవా కొనసాగుతుందని చెబుతుండటంతో ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 48 గంటల ఉత్కంఠకు నేటి మధ్యాహ్నం లోపే తెరపడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 185 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఖమ్మం జిల్లాలో 12,16,796 మంది ఓటర్లు ఉండగా 10,20,087 మంది ఓటర్లు తీర్పునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో 79% మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగిం చుకున్నారు. రౌండ్ల వారీగా లెక్కింపు కొనసాగుతుంది. ఖమ్మంలో ఐదు నియోజక వర్గాలను 103 రౌండ్లలో లెక్కిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82 రౌండ్లుగా చేపడుతారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లోని సూర్యాపేట హైవే పక్కనున్న శ్రీ చైతన్య సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కిట్స్‌) కళాశాలలో లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెంలో అనుబోస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొత్తం ఐదు నియోజకవర్గాల లెక్కింపు చేపడుతారు.
లెక్కింపు విధానం…
లెక్కింపు చేపట్టే సిబ్బంది ఉదయం 6.30 గంటల కల్లా కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని కౌంటింగ్‌ కేంద్రంలో తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం అరగంట తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లను లెక్కించడానికి ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అదనంగా మరో టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువగా ఉంటే, ఈవీఎంతో కలిపి సమాంతరంగా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు రిటర్నింగ్‌ అధికారే సర్వాధికారి, పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, ఎలక్షన్‌ ఏజెంట్లను రిటర్నింగ్‌ అధికారి లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలోకి 14 మందికి మించకుండా కౌంటింగ్‌ ఏజెంట్లను అనుమతిస్తారు. ఈవీఎంల సీల్‌ సరిగా ఉందా? లేదా? ట్యాంపరింగ్‌ వంటివి ఏమైనా జరిగాయా? నిర్ధారించుకున్నాకే లెక్కింపు చేపడుతారు. ప్రతీ టేబుల్‌ మీద బ్లూ పాయింట్‌ పెన్‌ ఫారం 17 సీలోని పార్ట్‌ టూ పేపర్‌ ఉంచాలి. కౌంటింగ్‌కు ముందు 17 సీ ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో…లేదో సరిచూసుకుంటారు. వాటిని నోట్‌ చేసుకోవడంతో పాటు ఏజెంట్లకు చూపించి సంతకాలు చేయిస్తారు. ఈవీఎంల సీళ్లు తొలగించి రిజల్ట్‌ బటన్‌ నొక్కుతారు. అప్పుడు అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఒక్కో రౌండ్లో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో బోర్డుపై రాస్తారు.
భద్రాద్రి కొత్తగూడెంలో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మొత్తం 244 బూత్‌ల్లో 1,98,402 ఓట్లకు గాను 1,58,978 ఓట్లు పోలయ్యాయి. వీటిని 18 రౌండ్లుగా లెక్కిస్తారు. ఇల్లెందులో 241 బూతుల్లో 2,19,569 ఓట్లకు గాను 1,76,569 ఓట్లు పోలయ్యాయి. వీటిని 18 రౌండ్లుగా లెక్కిస్తారు. కొత్తగూడెంలో 2,43,846 ఓట్లలో 253 బూత్‌లలో 1,86,347 ఓట్లు పోలయ్యాయి. వీటిని 19 రౌండ్లుగా లెక్కిస్తారు. అశ్వారావుపేటలో 1,55, 961 ఓట్లకు గాను 1,35,497 ఓట్లు పోలయ్యాయి. 184 బూతులను 14 రౌండ్లుగా లెక్కిస్తారు. భద్రాచలంలో 1,48,661 ఓట్లకు గాను 1,17,447 ఓట్లు 176 పోలింగ్‌ స్టేషన్‌లలో నమోదు కాగా వీటిని 13 రౌండ్లుగా విభజించారు. మొత్తం 7,75,109 ఓట్లను 82 రౌండ్లుగా లెక్కిస్తారు.
ఖమ్మం జిల్లాలో లెక్కింపు ఇలా…
ఖమ్మం జిల్లాలో 12,16,796 ఓట్లలో 10,20,087 ఓట్లు 1,456 బూత్‌లలో నమోదయ్యాయి. వీటిని 103 రౌండ్లుగా విభజించారు. ఖమ్మం నియోజకవర్గంలో 2,30,724 ఓట్లు 355 బూత్‌లలో వేశారు. వీటిని 25 రౌండ్లుగా లెక్కిస్తారు. పాలేరులో 289 బూత్‌లలో 2,14,810 ఓట్లు పోలయ్యాయి. వీటిని 20 రౌండ్లుగా లెక్కిస్తారు. మధిరలో 286 బూత్‌లలో 1,94,615 ఓట్లు నమోదయ్యాయి. వీటిని 19 రౌండ్లుగా విభజించారు. వైరాలో 252 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. 1,67,389 ఓట్లు పోలయ్యాయి. వీటిని 18 రౌండ్లుగా లెక్కిస్తారు. సత్తుపల్లిలో 2,12, 549 ఓట్లు 292 బూత్‌లలో పోల్‌ కాగా 20 రౌండ్లుగా వీటిని లెక్కిస్తారు.
టెన్షన్‌…టెన్షన్‌…
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అందరిలోనూ టెన్షన్‌ నెలకొంది. ఎవరు గెలుస్తారు…ఎవరు ఓడతారోనని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు, ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై ఇప్పటికే రూ.కోట్లలో బెట్టింగ్‌లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో పాలేరు, ఖమ్మం నియోజకవర్గంపైనే అధికమొత్తంలో బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ అధిక స్థానాలు సాధిస్తుంది..? ఎవరు అధికారంలోకి వస్తారు? సీఎం అయ్యేది ఎవరు? ఇలా అన్ని అంశాలపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. అందరూ ఉదయం 8 గంటల నుంచే టీవీలకు అతుక్కుపోయి ఉండనున్నారు.

 

Spread the love