నేడు టెట్‌

– నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
– 4,78,055 మంది అభ్యర్థులు
– 2,052 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాతపరీక్ష జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. టెట్‌కు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారికోసం 1,139 పరీక్షా కేంద్రాలు, పేపర్‌-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారి కోసం 913 పరీక్షా కేంద్రాలున్నాయి. శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ జరగనుంది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇందులో వచ్చే మార్కులకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 2,052 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా వంటి చర్యలను అధికారులు తీసుకున్నారు. బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతోనే ఓఎంఆర్‌ గడులను నింపాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

Spread the love