నేటితో ఎన్నికల ఉత్కంఠకు తెర

– గెలుపుపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల ధీమా
– కాంగ్రెస్‌ కే విజయ అవకాశాలు
నవతెలంగాణ-అశ్వాపురం
గత నెల 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠానికి ఆదివారంతో తెరపడనుంది. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వారి భవితవ్యం ఏంటనే అంశం మరికొన్ని గంటల్లోనే తేలనుంది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు విజయం దక్కుతుందంటే, తమకే విజయం వరిస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలలో ప్రజల నాడి కాంగ్రెస్‌కే అధికంగా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే చెబుతున్నారు.
కాంగ్రెస్‌ కే విజయవకాశాలు అధికమంటున్న విశ్లేషకులు
పినపాక నియోజకవర్గానికి పోటీ చేసిన ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నెల రోజులుగా హోరా హోరిన ప్రచారాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులైన పినపాక అభ్యర్థి రేగా కాంతారావు, భద్రాచలం అభ్యర్థి తెల్ల వెంకటరావు పక్షాన వారి విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో బహిరంగ సభకు హాజరై భారీ ఎత్తున ఉపన్యాసాలు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయాన్ని కోరుతూ మణుగూరు పట్టణంలో ఏఐసీసీ నాయకులు రాహుల్‌ గాంధీ కార్నర్‌ రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించారు. వారి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ఇదంతా ఒకటైతే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం పార్టీ పట్ల సానుకూలత లేకుండా పోయిందని తెలుస్తుంది. ఇక పోలింగ్‌ సమయం దగ్గర పడే నాటికి కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు మరింత పెరిగి విజయవకాశాలను తీసుకొచ్చి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. బిఆర్‌ఎస్‌కు ప్రజల్లో మద్దతు తగ్గడానికి కొందరు స్థానిక నాయకుల వైఫల్యాలే కారణమని పలువురు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ గెలుపుకు అన్ని విధాల దోహదపడి నేడు విజయ అవకాశాలను చేజిక్కించుకోనిందని ప్రజలు అంటున్నారు. మరికొన్ని గంటల్లో ప్రజల తీర్పు ఎవరి పక్షాన ఇస్తారో వేచి చూడాల్సిందే.

Spread the love