నేడు స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్
నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని శనివారం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇందిరాపార్కు వద్ద ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, వీఎస్‌టీ జంక్షన్‌లలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, సమస్యను పరిష్కరించేందుకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ తొలి హోంమంత్రి స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు.

Spread the love