నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. దానిలో తొలి విడతగా 10 బస్సులను మంగళవారం మియాపూర్‌లో మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభిస్తారు. ఆయనతో పాటు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కూడా పాల్గొంటారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రతి 20 నిముషాలకు ఒక బస్సును నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ‘ఈ-గరుడ’ అని పేరు పెట్టారు. రాబోయే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో 1,300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను దూర ప్రాంతాలకు నడపాలని నిర్ణయించారు. ‘ఈ-గరుడ’తో పాటు హైదరాబాద్‌లో 10 డబుల్ డెక్కర్ బస్సులను కూడా మంగళవారం రవాణామంత్రి ప్రారంభించనున్నారు.