నేటి సమాజానికి బుద్ధుని సందేశం అవసరం

– ధ్యాన మందిరానికి ఎస్డీఎఫ్‌ నిధులు : సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహారలో ధ్యానమందిరానికి అవసరమైన నిధులను స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్డీఎఫ్‌) నుంచి మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. గౌతమబుద్ధుని జయంతిని పురస్కరించుకుని బుద్ధ విహారను సందర్శించిన ఆయన అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసూయ, అసహనం, స్పర్థలు, ఉద్వేగాలు నిండిన వాతావరణం నెలకొని ఉన్న నేటి సమాజానికి బుద్ధుని సందేశం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఆయన సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరి వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వ్యక్తిగా, ప్రభుత్వపరంగా అవసరమైన సహాయాన్ని అందించ నున్నట్టు తెలిపారు. విహారకు వచ్చిన తనకు గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సీఎం తన అనుభవాన్ని వెల్లడించారు. రాజ్యం, అధికారమున్నా… వాటిని కాదని 29 ఏండ్ల వయసులోనే శాంతి కోసం బుద్ధుడు పరితపించారని గుర్తుచేశారు. ఆయన సిద్ధాంతం 2,500 ఏండ్లుగా నిలబడి ఉందని తెలిపారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థముందనీ, ఆ సూక్తి నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందినట్టు రేవంత్‌ రెడ్డి తెలిపారు. తాను ఏ పనినైనా ఎంతో ధ్యానంతో చేస్తానని చెప్పారు. విహార నుంచి ఒక పాఠశాలను నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బుద్ధిస్టులకు అన్ని రకాల సహాయ, సహకారాలుంటాయనీ, రాష్ట్రంలో బౌద్ధ భిక్కువులకు తగిన గౌరవం ఉంటుందని భరోసానిచ్చారు. ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదనీ.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం సూచించారు.” సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మంచి సందేశం, ఆలోచనలను పెంపొందించుకోవాలి. సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ స్ఫూర్తిదాయకం, అనుసరణీయం. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా, పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్‌ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం” అని ఆయన హామీనిచ్చారు.

Spread the love