– పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెంచిన టోల్ ట్యాక్స్ చార్జీలు సామాన్యులకు భారంగా మారనున్నాయనీ, వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నేటి నుంచి దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్ టాక్స్ రేట్లను సగటున 5శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెంపుదలను వాయిదా వేసిన కేంద్రం, పోలింగ్ ముగియగానే ప్రయాణీకులపై తీవ్ర భారాన్ని మోపిందని విమర్శించారు. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డులో టోల్ చార్జీలను 5శాతం పెంచుతున్నట్టు ఐఆర్‌బీ సంస్థ ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ పెంపుదల రూ.5 నుంచి రూ.50 వరకు పెరుగుతుందని తెలిపారు. ఈ చార్జీలు ప్రజలకు భారం కానున్నాయని పేర్కొన్నారు. ప్రతియేటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదని హితవు పలికారు.. టోల్‌గేట్ల వద్ద మంచినీరు, వాష్‌రూమ్‌లు తదితర కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో పాటు, గ్రామాలకు ఇరువైపుల సర్వీసు రోడ్లు కూడా వెయ్యలేదని తెలిపారు. చాలా సందర్భాల్లో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించటంలో విఫలమవుతున్నారని గుర్తు చేశారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని తెలిపారు. ఈ పెంపుదల సామాన్యుల నడ్డి విరిచి, టోల్‌గేట్ సంస్థల యజమానులకు దోచిపెట్టడమేనని విమర్శించారు.