టమాటా కిలో రూ.100

నవతెలంగాణ హైదరాబాద్: కిలో టమాటా ధర సెంచరీ దాటింది. ధర దడపుటిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటా రూ.67-70 వరకు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.100-110 పలుకుతోంది. ఇక కిలో రూ.20-25 ఉండాల్సిన ఉల్లిగడ్డ ధర రెట్టింపు అయింది. వర్షాల కారణంగా టమాటా, ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ ఆటోలపై రూ.100కు 4 కిలోలు, రైతు బజార్లలోలో 3 కిలోలు వచ్చిన టమాటా ధర సామాన్యుల ఠారెత్తిస్తోంది.
వర్షాలతో పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట దెబ్బతింటోంది. దీంతో రైతు బజార్ల నుంచి సూపర్‌ మార్కెట్ల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. టమాటా, ఉల్లిగడ్డతో పాటు ములక్కాయ, క్యాప్సికమ్‌ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌ శివారులోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా మార్కెట్‌కు లోకల్‌ టమాటా పెద్దగా రావడం లేదు. మరోవైపు ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్‌ నుంచి నగరానికి వచ్చే టమాటా 60 శాతం తగ్గిపోయాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి. షోలాపూర్‌, నాసిక్‌, అహ్మద్‌నగర్‌, పుణె తదితర ప్రాంతాల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు రోజు సుమారు 90-100 ఉల్లిగడ్డ లారీలు వస్తుండేవని, నెల రోజులుగా ఆ సంఖ్య 30-60 వరకు తగ్గిపోయిందంటున్నారు వర్తకులు.

 

Spread the love