నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగనున్నట్టు పేర్కొన్నది. పరీక్షకు నిరుడు బయోమెట్రిక్ ఉండగా, ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రూప్-4 రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్-1కు 9.45, పేపర్-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు. అదే సమయంలో పలు విద్యలయాలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రేపు గ్రూప్-4 పరీక్ష ఉండడంతో.. ఆ రోజు పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించే 2వేల 878 కేంద్రాలకు సంబంధించిన విద్యాసంస్థలకు మాత్రమే శనివారం సెలవు ఉంటుంది. ఇక రేపు పాలిటెక్నిక్ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షలున్నందున వాటిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. రేపు జరగాల్సిన పరీక్షను జులై 15వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక , శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.