బొమ్మలండీ బొమ్మలు..

బొమ్మలండీ బొమ్మలు..బొమ్మలండీ బొమ్మలు..
బతకనేర్చిన బొమ్మలు.. మిథ్యాతరగతి బొమ్మలు..
ఎక్కడో తడీసడీ వున్న బొమ్మలేనండి..
కలుగులో జీవితం కరగదీసుకునే బొమ్మలండీ..
పలాయనం బండెక్కి పారిపోయే బొమ్మలు..
వాట్సప్‌లో బుద్ధిని బలిచ్చే నాగరిక బొమ్మలు..
అప్పుడప్పుడూ కొవ్వుబారతాయండి..
పొరుగువాడి ప్రాణగండంలో ఇంకా కొయ్యబారతాయండి..
బొమ్మలకెన్నో లెక్కలుంటాయండి..
లోపల్లోపల ఎన్నో లుకలుకలుంటాయండి..
కొన్నిటికాడ ఈ బొమ్మలకు తలతిక్కలుంటాయండి..
ఈ బొమ్మలనాడించే ఒక కేతిగాడు వచ్చాడండి..
ఈ బొమ్మలని బుర్రలేని బుట్టబొమ్మలు చేసి
బొమ్మలకి బొమ్మలకి మధ్య
ఒక దొమ్మీలాట మొదలెట్టాడండి.
తిలకం బొమ్మలు, గడ్డం బొమ్మలు,
బైబిలు బొమ్మలు.. రకరకాల బొమ్మలు..
తైతక్క బొమ్మలు.. తలూపే బొమ్మలు
కూర్చున్న కొమ్మ నరుక్కునే బొమ్మలు..
కూర్చుకున్న బాంధవ్యాలు కూల్చుకునే బొమ్మలు..
కేతిగాడి చేతిలో తోలుబొమ్మలు బొమ్మలు
కేతిగాడు చేతిలో వ్యవస్థలు కీలుబొమ్మలు
కేతిగాడి రాజకీయ దేవుడి బొమ్మ ముందు
సాగిలపడిన కొయ్యబొమ్మలు.. చెక్కబొమ్మలు..
బొమ్మలండీ బొమ్మలు.. కొయ్యబారిన బొమ్మలు..
బొమ్మల కింద కాష్టం పేరుస్తున్న
కేతిగాడి భజనలో తరిస్తున్న బొమ్మలు..
అంతరిస్తున్న బొమ్మలు..!
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 9949429449

Spread the love