పాఠశాలల్లో ట్రాఫిక్‌ అవేర్నెస్‌ పార్కులు

Traffic awareness parks in schools– ఈ ఏడాది 500 నుంచి వెయ్యిలోపు ఏర్పాటుకు చర్యలు
– ట్రాఫిక్‌ రూల్స్‌పై పాఠ్యాంశంగా చేర్చేలా క్యాబినెట్‌లో చర్చిస్తాం
– రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలి
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌ సహకారంతో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో ట్రాఫిక్‌ అవేర్నెస్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి ‘జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను’ మంత్రి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ప్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ‘ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం’ పోస్టర్‌, పాంప్లెట్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మాసోత్సవాలను ఈనెల 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రజలందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. రవాణా, పోలీసు, విద్యాశాఖతోపాటు ఇతర శాఖలన్నీ రోడ్డు భద్రతపై అవగాహన చేసుకొని అమలు చేయడంతోపాటు ప్రజలను చైతన్యవంతులను చేసి సామాజికంగా ముందుకు వెళ్లాలన్నారు. ఏ విషయమైనా చిన్నప్పుడు నేర్చుకున్నది పెద్దయిన తర్వాత ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో యూనిసెఫ్‌ వారి సహకారంతో ట్రాఫిక్‌ అవేర్నెస్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది సుమారు 500 నుంచి వెయ్యి పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈనెల 7న జాతీయ రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీచే జాతీయ రవాణా సమావేశం జరుగుతుందని తెలిపారు.
ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటివరకు 7వేల మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసిన వారి లైసెన్సులను రద్దు చేస్తామని, అయినా అలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి చెప్పాలని మంత్రి సూచించారు. అనంతరం ఎలక్ట్రికల్‌ స్టేషన్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో ప్రతి గంటకూ 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, ఈ విషయమై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని అన్నారు. రోడ్‌ సేఫ్టీ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులు ఉన్నా లేకున్నా.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. రవాణా శాఖ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసే సమయంలో దరఖాస్తుదారునికి ఏ మేరకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన ఉన్నది లేనిది పరిశీలించిన తర్వాతే లైసెన్సులు మంజూరు చేస్తున్నామని, వాహనాల ఫిట్‌నెస్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌, జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు సి.రమేష్‌, మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, డీటీసీలు రవీంద్ర కుమార్‌, కిషన్‌, సదానందం, ఆర్టీవోలు పురుషోత్తం రెడ్డి, సిపి.వెంకటేశ్వర్‌రావు, ఎంవీఐలు పాల్గొన్నారు.

Spread the love