హైదరాబాద్ లో మరో గణేష్‌ మండపం వద్ద విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : గణేష్‌ మండపం వద్ద విద్యుత్‌షాక్‌ తగిలి టెంట్‌హౌస్‌లో పనిచేసే ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవాం నారాయణగూడ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ షఫీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రహ్లాద్‌ ప్రధాన్‌ (35) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బతుకమ్మకుంటలో నివాసం ఉంటూ తిలక్‌నగర్‌లోని ఓ టెంట్‌హౌస్‌లో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. నారాయణగూడ పద్మశాలి భవన్‌ సమీపంలో బాయ్స్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన గణేష్‌ మండపానికి అవసరమైన టెంట్‌ సామగ్రిని తీసుువచ్చాడు. వర్షాలు కురుస్తుండడంతో మండపం లోపలికి వర్షం నీరు రాకుండా ఉండేందుకు కవర్‌ వేయాలని మండపం నిర్వాహకులు సూచించారు. నిచ్చెన సహాయంతో మండపం పైకి ఎక్కి కవర్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన మండపం నిర్వాహకులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రహ్లాద్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

Spread the love