గద్దర్‌ అంత్యక్రియల్లో విషాదం

– గుండెపోటుతో సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ మృతి
– భారీగా తరలివచ్చిన జనం
– అల్వాల్‌లో తోపులాట
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజా గాయకుడు గద్దర్‌ అంత్యక్రియల్లో విషాదం చోటుచేసుకుంది. కడసారి చూపు కోసం వచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులతో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కి అత్యంత ఆప్తుడు, సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌(63) గుండెపోటుతో మృతిచెందారు. భారీగా తరలివచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేక పోవడంతో తోపులాట జరిగింది. సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ కిందపడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
జహీరుద్దీన్‌ అలీఖాన్‌ గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. ఎల్బీ స్టేడియంలో నివాళ్లర్పించాక.. వాహనంలో గద్దర్‌ భౌతికకాయం వెంటే ఆయన కూడా ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియల సమయంలో కిక్కిరిసిన జనం ఉండటంతో జహీరుద్దీన్‌ కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్‌ అరెస్టుతో మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈయన కూడా తెలంగాణ కళాకారుడే. గద్దర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన విద్యావంతుల వేదిక సదస్సులో కూడా జహీరుద్దీన్‌ పాల్గొన్నారు. గద్దర్‌ చనిపోయారని తెలుసుకున్న జహీర్‌ వెంటనే అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.
అప్పట్నుంచీ గద్దర్‌ అంత్యక్రియలు ముగిసే వరకూ వెన్నంటే ఉన్నారు. అయితే, అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌ వద్ద స్థలం సరిపోకపోవడం.. పోలీసులు ముందుగానే హెచ్చరించినా జనాలు తోసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన జహీరుద్దీన్‌ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు.
ఉర్దూ పత్రికా ప్రపంచానికి తీరనిలోటు
జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : సియాసత్‌ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రికా ప్రపంచానికి తీరనిలోటని తెలిపారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్‌ పోషించిన పాత్రను, వారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అలీఖాన్‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కె తారకరామారావు కూడా అలీఖాన్‌ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

Spread the love