ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విష జ్వరంతో టెన్త్ క్లాస్ విద్యార్థిని మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ ఆశ్రమం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మహేశ్వరి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేశ్వరిని పాఠశాలలో ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఆమె మృతి చెందినట్లు ఆదివాసి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరి జ్వరంతో బాధపడుతుందన్న విషయం తెలుసుకున్న తండ్రి మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహేశ్వరి తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్వరి మృతికి కారణమైన, నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకో ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. మహేశ్వరి మృతికి కారణమైన అధికారులతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వార్డెన్‌లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Spread the love