– గోడ కూలి తొమ్మిదిమంది చిన్నారులు మృతి
– గోడపక్కనే టెంట్ కింద మట్టితో శివలింగాలు చేసుకుంటుండగా ఘటన
సాగర్ : మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఆదివారం భారీ విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక పాత ఇంటి యొక్క గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రాష్ట్రంలో శనివారం రేవా, నార్సింగ్‌పూర్ జిల్లాల్లో రెండు వేరువేరు ఘటనలో గోడ కూలి ఆరుగురు చిన్నారులు మరణించిన విషాదం మర్చిపోక ముందే ఒక రోజు తరువాత ఈ ప్రమాదం జరిగింది. రేహ్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని సనోధ పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో మతపరమైన కార్యక్రమం జరుగు తోంది. ఈ సందర్భంగా గోడ పక్కనే వేసుకున్న టెంట్‌లో చిన్నారులు మట్టితో శివలింగాలు తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారంతా 10 నుంచి 15 ఏళ్ల లోపు వారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నట్లు చెప్పారు. ఈ సంఘటన జరిగిన తరు వాత పాత ఇంటిని బుల్డోజర్‌తో అధికా రులు కూల్చివేశారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోం దని, ఘటనకు బాధ్యులైన వారిపై త్వరలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని స్థానిక సబ్- డివిజనరల్ పోలీసు అధికారి ప్రకాశ్ మిశ్రా తెలిపారు.
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల ఒకొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎక్స్‌లో పోస్టు చేశారు.