– ముఖ్యమంత్రి కార్యాలయానికి దస్త్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పౌజ్ టీచర్ల బదిలీల ప్రక్రియ త్వరలోనే చేపట్టే అవకాశమున్నది. ఇందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి విద్యాశాఖ పంపించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన దస్త్రంపై ఈలోపు సంతకం చేసే అవకాశమున్నది. స్పౌజ్ బదిలీల్లో సుమారు 850 మంది ఉపాధ్యాయులకు అవకాశం ఉండనుంది. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపులు చేసేందుకు 2021, డిసెంబర్ ఆరున 317 జీవోను గత ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. వివిధ రూపాల్లో ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి వస్తే 317 జీవో బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అందుకనగుణంగా 317 జీవో బాధితుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మెన్‌గా మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు చర్చించింది. బాధిత ఉద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. న్యాయ నిపుణులతో పలు అంశాలపై చర్చించి గతేడాది అక్టోబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను సమర్పించింది. దానిపై మంత్రివర్గంలో చర్చించి గతేడాది నవంబర్ 30న స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పౌజ్ (భార్యాభర్తలు), పరస్పర (మ్యూచువల్), వైద్య కారణాలున్న వారి బదిలీలకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు కూడా స్పౌజ్ బదిలీలు జరగనున్నాయి. సుమారు 850 మంది ఉపాధ్యాయ భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కలగనుంది. 2023 జనవరిలో 615 మంది స్కూల్ అసిస్టెంట్ల స్పౌజ్ బదిలీలను గత ప్రభుత్వం చేపట్టింది. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను చేపట్టలేదు. దీంతో 1,500 మంది ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీలు స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. వారు బదిలీల కోసం అనేకసార్లు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. మంత్రులు, అధికారులకు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారిలో సుమారు 850 మంది స్పౌజ్ బదిలీలను చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు విద్యాసంవత్సరం మధ్యలో వారిని బదిలీ చేస్తే బోధనపై ప్రభావం పడుతుందనీ, విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. దీనిపై సమగ్రంగా చర్చించి విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశమున్నది. అందుకనుగుణంగానే త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన స్పౌజ్ బదిలీలు కూడా ఆ తర్వాత నిర్వహించే అవకాశమున్నట్టు తెలిసింది.