– సెంట్రల్ రైల్వే సీపీఆర్‌ఓకు ‘బహుమతి’
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లలో ప్రధాని నరేంద్ర మోడీ ‘3డీ సెల్ఫీ పాయింట్ల’ను ఏర్పాటు చేసినందుకు ఎంత ఖర్చు అయిందో చెప్పడమే ఆయన చేసిన నేరం. బహుమతిగా ఆ అధికారిపై బదిలీ వేటు వేశారు. రైల్వే స్టేషన్లలో ప్రధాని కటౌట్లతో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలంటూ సామాజిక కార్యకర్త అజరు బోస్ సమాచార హక్కు చట్టం కింద దేశంలోని ఐదు రైల్వే జోన్లకు దరఖాస్తులు పంపారు. సెంట్రల్ రైల్వేకి చెందిన సీపీఆర్‌ఓ శివరాజ్ మన్స్‌ప్యూర్ ఈ దరఖాస్తుకు సమాధానం పంపారు. అదే ఆయన చేసిన నేరం…పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉండగానే శివరాజ్‌కు బదిలీ ఉత్తర్వులు అందజేశారు.
2011 బ్యాచ్‌కి చెందిన ఐఆర్‌టీఎస్ అధికారి శివరాజ్ సెంట్రల్ రైల్వే పీఆర్‌ఓగా గత సంవత్సరం మేలోనే బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి కారణం చూపకుండానే ఆయనను డిసెంబర్ 29న సెంట్రల్ రైల్వే ముంబయి కేంద్ర కార్యాలయం బదిలీ చేసింది. తదుపరి పోస్టింగుపై కూడా ఆయనకు ఇప్పటివరకూ సమాచారం ఇవ్వలేదు. శివరాజ్ స్థానంలో స్వప్నిల్ డి నీలాను నియమించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. శివరాజ్ బదిలీకి ఒక రోజు ముందు…అంటే డిసెంబర్ 28న జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లకు రైల్వే బోర్డు ఓ సమాచారం పంపింది. ఆర్‌టీఐ కింద కోరే సమాచారానికి సమాధానం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలంటూ అందులో సుద్దులు చెప్పింది.
ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన 3డీ బూత్‌ల సంఖ్యపై తనకు విడివిడిగా సమాధానాలు వచ్చాయని, అయితే తాత్కాలిక, శాశ్వత బూత్‌ల ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారో మాత్రం ఎవరూ వివరించలేదని సామాజిక కార్యకర్త బోస్ తెలిపారు. కేవలం సెంట్రల్ రైల్వే నుండి మాత్రమే తనకు సవివరమైన సమాధానం అందిందని చెప్పారు. నాగపూర్, ముంబయి, పూనే, భుసావల్, షోలాపూర్… ఈ ఐదు డివిజన్లలోని 30 స్టేషన్లలో తాత్కాలిక, 20 స్టేషన్లలో శాశ్వత సెల్ఫీ బూత్‌లు ఏర్పాటు చేశారని తనకు సమాధానం ఇచ్చారని వివరించారు. కేటగిరీ ‘ఏ’ స్టేషన్లలో ఒక్కో తాత్కాలిక బూత్ ఏర్పాటుకు రూ.1.25 లక్షలు, కేటగిరీ ‘సీ’ స్టేషన్లలో ఒక్కో శాశ్వత బూత్ ఏర్పాటుకు రూ.6.25 లక్షలు (పన్నులు మినహా) ఖర్చు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అనుమతి లభించింది. తనకు డిప్యూటీ జనరల్ మేనేజర్ అభరు మిశ్రా సమాధానం పంపారని, అయితే సీపీఆర్‌ఓపై వేటు వేశారని బోస్ చెప్పారు. శివరాజ్ గతంలో భుసావల్‌లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేశారు. రైల్వే ఆదాయాన్ని పెంచినందుకు, టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించినందుకు, దొంగతనాలను అరికట్టినందుకు ఆయనకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అవార్డు కూడా అందజేశారు. రైల్వేలు మెరుగైన పద్ధతులు అవలంబించిందుకు ఆయనకు పురస్కారాన్ని కూడా అందించారు.
శివరాజ్ బదిలీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను విడుదల చేయడం లేదని, దానికి బదులుగా ప్రధానికి ప్రాచుర్యం కల్పించేందుకు పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చు చేస్తోందని విమర్శించారు. ‘గతంలో సాయుధ దళాల త్యాగాలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. మోడీ కటౌట్లతో 822 సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సైనిక దళాలను ఆదేశించారు. కరువు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం సొమ్ము విదల్చడం లేదు. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులు విడుదల చేయడం లేదు.