3 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

– అక్టోబర్‌3 లోపు ప్రక్రియ పూర్తి
– నేడు షెడ్యూల్‌ విడుదల : అధికారులతో మంత్రి సబితా సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధివిధానాలతో శుక్రవారం (నేడు) షెడ్యూల్‌ విడుదలకానుంది. నెల రోజుల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఎన్‌సిఇఆర్‌టి కార్యాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి, పారదర్శకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని
టీచర్లకు సమాచారం ఇవ్వాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బదిలీలకు సెప్టెంబర్‌ 3 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరిలోనే టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 1 కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించారు. టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యయులుగా 5 ఏళ్లు నిండిన వారంతా తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే, దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలపై స్టే విధించింది. అప్పటికే సుమారు 75వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ బదిలీలపై స్టే ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభించింది.
విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు – పిఆర్‌టియు టిఎస్‌
ఉపాధ్యాయుల బదిలీ,పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలకు ఆదేశాలు జారీచేసినందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పిఆర్‌టియు టిఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌ రెడ్డి,బీరెల్లి కమలాకర్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు.
వెంటనే చేపట్టాలి – ఎస్‌టియుటిఎస్‌
జివొ నెం5పై హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఎస్‌టియుటిఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానంద్‌ గౌడ్‌, పర్వతరెడ్డి విద్యాశాఖ మంత్రిని కోరారు. గురువారం మంత్రిని కలిసిన వారు ఇతర పెండింగ్‌ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
కట్‌ ఆప్‌ డేట్‌ సెప్టెంబర్‌1 గా ఆప్షన్‌ ఇవ్వాలి – తపస్‌
ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌లో కట్‌ ఆఫ్‌ డేట్‌ సెప్టెంబర్‌1 గా ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఖాళీలన్నింటినీ కౌన్సిలింగ్‌లో చూపాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, సురేష్‌ సూచించారు.
ప్రభుత్వ వైఖరి ఏకపక్షం – టిఎస్‌పిటిఎ
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా షెడ్యూల్‌ విడుదల చేసిందని టిఎస్‌పిటిఎ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షాకత్‌ అలీ, పిట్ల రాజయ్య అన్నారు. సెప్టెంబర్‌ 1న ఇందిరా పార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నా యథావిథిగా కొనసాగుతుందని తెలిపారు.

Spread the love