బదిలీలు, పదోన్నతులు, నియామకాలకు చొరవ తీసుకోవాలి

– విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘానికి యూఎస్‌పీసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణాధికారులు, సర్వీసు పర్సన్ల పోస్టులను మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలకు సంబంధించి చొరవ తీసుకోవాలని కోరింది. శుక్రవారం విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతున్నందున విద్యారంగానికి సంబంధించిన సమస్యలపై చర్చించి పరిష్కారానికి సిఫారసు చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా, ఆర్థిక శాఖల మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, టి హరీశ్‌రావుకు యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్‌ కుమార్‌, పి నాగిరెడ్డి, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, షౌకత్‌ అలీ, కె రమేష్‌, బి కొండయ్య, ఎస్‌ హరికిషన్‌, వై విజయకుమార్‌, జాడి రాజన్న, జాదవ్‌ వెంకట్రావు, శాగ కైలాసం గురువారం వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలకు డీఈవో పోస్టులు, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఈవో పోస్టు, ప్రతి నూతన మండలానికి ఒక ఎంఈఓ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం సర్వీసు పర్సన్లను నియమించాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీల్లో విద్యావాలంటీర్ల నియామకానికి, ఉపాధ్యాయుల బదిలీలు సాధ్యం కాకపోతే పదోన్నతులు, నియామకాల ప్రక్రియ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మన ఊరు-మన బడి మొదటి దశ 9,123 పాఠశాలల్లో ఇంకా 30 శాతం కూడా పనులు పూర్తి కాలేదని తెలిపారు. మొదటి దశ పాఠశాలలను పూర్తి చేయటంతోపాటు రెండోదశ పనులను ప్రారంభించాలని, అందుకఅవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు.
– ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
– మంత్రి సబితకు ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఈటీలు, పండితుల సమస్యను పరిష్కరించాలని తెలిపారు. జీవోనెంబర్‌ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక భారం లేని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్‌ సురేష్‌, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love