– టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఎనిమిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఐదు సంవత్సరాల తర్వాత బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అత్యంత పారదర్శకంగా పదోన్నతులు, బదిలీల జాబితాలు రూపొందించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, డీఈవో సోమశేఖరశర్మకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఐడిఓసిలో కలెక్టర్, డీఈఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న మాట్లాడారు. గతంలో అనేకసార్లు పదోన్నతులు నిరాకరించిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయని నిబంధనల మేరకు అలాంటి వారిని తొలగించి పదోన్నతుల జాబితా తయారు చేయాలని సూచించారు. సీనియారిటీ జాబితాలలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఉపాధ్యాయులు పదేపదే అప్పీల్స్ చేసుకోవాల్సి వస్తున్నది కాబట్టి అప్పీల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి, జాబితాలు విడుదల చేయాలని కోరారు. స్పౌజ్, ప్రిఫరెన్షియల్ క్యాటగిరీలు ఉపయోగించుకునేవారి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి, దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. నిబంధనల ప్రకారం జాబితాలు రూపొందించాలని కోరారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని కలెక్టర్ కు విన్నవించారు. మ్యూచువల్, స్పౌజ్ బదిలీల విషయంలో నిబంధనలు, కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవహరించాలని సూచించారు. పదోన్నతులలో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని కోరారు. ఖాళీలన్నింటినీ చూపించాలని, గ్రీవెన్స్ కు మరొకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ సమావేశ వివరాలు…
– హెచ్‌ఎం బదిలీ ప్రభుత్వ 14, జడ్పీ 99 మందికి బదిలీలు.
– ప్రధానోపాధ్యాయులు క్లియర్ వేకెన్సీస్ 66 (62ం4)ఉన్నాయి.
– బదిలీలకు వచ్చిన దరఖాస్తులు 3766 రిజెక్ట్ అయినవి 87
– గ్రీవెన్స్ ద్వారా వచ్చిన దరఖాస్తులు 375 పరిష్కరించినవి 328, రిజెక్ట్ అయినది 47.
– మెడికల్ దరఖాస్తులు 207 రిజెక్ట్ అయినవి 31.
అ- ప్పిల్స్ కోసం రెండు రోజులు సమయం ఇచ్చారు.
– అప్పీల్ ను ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తారు.
– 93 మెడికల్ అప్లికేషన్ రీ ఎక్షామిన్ చేస్తారు.
– పైస్థాయి లో జీరో ఎన్రోల్మెంట్ ఉంటే ఎస్‌ఏలు పండిట్ లను చూపించరు. జీరో ఎన్ రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను చూపించరు.
– స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ లో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఉంటుంది.
– అడక్వసి అమలులో ఉంటుంది. అన్ని క్యాడర్ల స్టేటస్ ప్రకటిస్తారు.
– మ్యూచువల్ వారికి బదిలీల తర్వాత అవకాశం ఇస్తారు.
– స్పౌజ్ కి దగ్గర ప్లేసుల్లో కోరుకునే వారు తప్పుడు సమాచారం ఇస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటారు.