రవాణా ఆదాయం రూ.6,285 కోట్లు

– ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ఆదాయం రూ.6,285 కోట్లు వచ్చే అవకాశం ఉన్నదని ఆ శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ తెలిపారు. శనివారంనాడాయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 1.53 కోట్ల వాహనాలు ఉన్నాయనీ, 2021-22లో రూ.3,971 కోట్ల ఆదాయం రాగా, 2022-23లో మార్చి 17వ తేదీ నాటికి రూ.6,055 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.2,309 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని వివరించారు. ఈనెలాఖరు నాటికి ఈ ఆదాయం రూ.6,285 కోట్లకు చేరుతుందని అంచనా వేశామన్నారు. రవాణాశాఖకు పన్నులు కట్టకుండా తిరుగుతున్న వాహనాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా తనిఖీలు చేసి 21,347 వాహనాలను గుర్తించినట్టు తెలిపారు. వీటి నుంచి ప్రభుత్వానికి కట్టవలసిన రూ.54.21 కోట్ల పన్నులు, పెనాల్టీగా రూ.9.37 కోట్లు…మొత్తంగా రూ.63.58 కోట్లు వసూలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాలు, రవాణాశాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు, కమిషనర్‌ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love